వక్ఫ్ సేఫ్.. కానీ, సుప్రీంకోర్టు ఆదేశం ఇదే!

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టం ద్వారా తమ ఆస్తులకు భంగం కలుగుతుందంటూ దేశవ్యాప్తంగా 100కి పైగా పిటిషన్లు పడ్డాయి. వీటిలో ప్రధానంగా ముస్లింల ఆచారాలు, వ్యవహారాలు, ఆస్తుల్లోకి కేంద్రం జోక్యం చేసుకోవడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు. ఈ క్రమంలో సదరు చట్టాన్నే పూర్తిగా రద్దు చేయాలని, పాత చట్టాన్ని కొనసాగించాలని కోరారు. అయితే ఈ పిటిషన్లపై ఇప్పటికే పలు దఫాలుగా కోర్టు విచారించింది.

తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో పూర్తిగా వక్ఫ్ సవరణ బిల్లు-2025లో స్టే విధించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల చట్టం స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని పేర్కొంది. అయితే కీలకమైన ఒక నిబంధనపై మాత్రం స్టే విధించగలమని తెలిపింది. ఐదేళ్లపాటు ముస్లింను అనుసరించిన వ్యక్తి ఆస్తులను మాత్రమే వక్ఫ్ చేయగల నిబంధనపై స్టే విధిస్తున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టానికి కొన్ని రక్షణలు ఉండాలని పేర్కొంది.

మరిన్ని అంశాలు

  • వక్ఫ్ (సవరణ) చట్టం-2025పై పూర్తి స్టే విధించడానికి నిరాకరణ.
  • కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని వ్యాఖ్య.
  • వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య మెజార్టీలో ఉండాలి.
  • బోర్డు లేదా కౌన్సిల్‌లో ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలి.
  • చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ముస్లిమే ఉండాలి.

అనేక వివాదాలు

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టం-2025పై అనేక వివాదాలు రాజుకున్నాయి. దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన కూడా చేశారు. తమను ఆర్థికంగా అణగదొక్కడానికే, స్వతంత్రాన్ని దెబ్బతీసేందుకే కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు. కేంద్రం మాత్రం వక్ఫ్ ఆస్తులు పబ్లిక్, ప్రైవేటు ఆక్రమణలకు గురికాకుండా రక్షించడానికే దీనిని తీసుకువచ్చామని పేర్కొంది.