తెలంగాణలో యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్న విషయం తెలిసిందే. కేంద్రం నుంచి నిల్వలు వచ్చాయని ప్రభుత్వం చెబుతున్నా.. స్థానికంగా అవసరమైన రైతులకు మాత్రం అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో అన్నదాతలు నానా అగచాట్లు పడుతున్నారు. శనివారం కరీంనగర్‌లో పోలీసు స్టేషన్ అడ్డాగా.. రైతులను క్యూలో నిలబెట్టి.. యూరియా కోసం టోకెన్లను పంపిణీ చేశారు. ఇది తీవ్ర వివాదంగా మారింది. దీనిపై రైతులు, సంఘాల నాయకులు కూడా ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. సర్కారు మాత్రం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది.
తాజాగా రైతుల పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎలా ఉందో చెప్పేందుకు బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆమె కూడా మహిళా రైతే కావడం గమనార్మం. ఆమెకు 10 ఎకరాలకుపైగా పొలం ఉంది. దీనిలో వరి సహా.. ఇతర పంటలు పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా ఆమె యూరియా కోసం ప్రభుత్వ దుకాణాల వద్దకు వచ్చారు. కానీ, భారీ ఎత్తున క్యూలైన్లు కనిపించాయి. అరకిలో మీటరుకు పైగా రైతులు క్యూకట్టారు. కానీ.. ఇంత సేపు నిలబడ్డా.. యూరియా బస్తా లభిస్తుందా? అంటే.. ప్రశ్నార్థకమే.
అయినప్పటికీ.. యూరియా బస్తాల కోసం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యూలైన్‌లో నిలుచున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం, గుండాత మడుగు సహకారం సంఘం వద్ద రైతులు క్యూలైన్‌లో నిలబడ్డారు. ఈ లైను సుమారు అరకిలో మీటరుపైగానే ఉంది. అయినప్పటికీ.. రాథోడ్ ఆలైన్‌లోనే నిలబడ్డారు. తనకు ఐదెకరాల సాగుభూమి ఉందని ఆమె తెలిపారు. దీనికి సంబంధించి యూరియా కోసం.. వచ్చినట్టు తెలిపారు. కానీ, భారీ ఎత్తున క్యూలైన్లు ఉన్నాయని.. కనీసం రైతుల కోసం తాగునీటిని కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఇక, తనకున్న పట్టా పాస్ పుస్తకంతో క్యూలైన్‌లో నిలబడ్డ మాజీ మంత్రి.. మిగతా రైతులతో పాటు కూపన్లు రాయించుకు న్నారు.
ఈ సందర్భంగా రైతులతో సత్యవతి రాథోడ్ మాట్లాడారు. యూరియా కోసం రైతులు వారాల తరబడి పడిగాపులు కాస్తున్నట్టు కొందరు అన్నదాతలు తమ సమస్యలు మాజీ మంత్రికి చెప్పుకొన్నారు. ఒకరిద్దరు అయితే.. ఇంటికి కూడా పోకుండా.. అక్కడే ఉంటున్నామన్నారు. ఇక, ఒక్క బస్తా కూడా అందడం లేదని మరో ఇద్దరు రైతులు చెప్పారు. దీనిపై సత్యవతి రాథోడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం కుంటిసాకులతో తప్పించుకోకుండా రైతులకు యూరియా అందించాలన్నారు. “పరిస్థితి ఎలా ఉందో చూడండి. సీఎం, వ్యవసాయ మంత్రి వచ్చి ఈ లైన్‌లో నిలబడితే రైతుల బాధ వారికి తెలుస్తుంది” అని దుయ్యబట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates