ఇక నుంచి `జెట్ స్పీడ్`: తేల్చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న వేగం పెంచుతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. “ఇప్ప‌టికి 15 మాసాలు గ‌డిచాయి. మ‌న ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశాం. అనేక అభివృద్ధి ప‌నులు చేశాం. కేంద్రంతో సంబంధాలు మ‌రింత బ‌లోపేతం చేశాం. పెట్టుబ‌డులు తెస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది ఒక ఎత్తు. కానీ, ఇక‌, నుంచి స్పీడ్ పెంచుతున్నాం. ఇక‌పై `జెట్ స్పీడ్‌`తో నేను ముందుకు పోతా.. నాతో క‌లిసి ప్ర‌యాణించండి. లేక‌పోతే..వెనుక‌బ‌డిపోతారు. అదే జ‌రిగితే.. భ‌విష్య‌త్తులో మీరుఎక్క‌డ ఉంటారో ఊహించుకోండి.“ అని మంత్రులు, ఉన్న‌తాధికారులను ఉద్దేశించి చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

తాజాగా రాష్ట్రంలో రెండు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. 1) 12 మంది క‌లెక్ట‌ర్ల‌ను బ‌దిలీ చేశారు. వీరిలో న‌లుగురు కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించారు. అదేవిధంగా తాజాగా శ‌నివారం 14 జిల్లాల ఎస్పీల‌ను బ‌దిలీ చేశారు. వీరిలో ఏడుగురు కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించారు. ఇదేస‌మ‌యంలో తీవ్ర వివాదాలు ఎదుర్కొన్న‌.. రాజ‌కీయ వివాదాల‌ను ప‌రిష్క‌రించ‌లేక పోయిన‌.. మ‌రో ఆరుగురు ఎస్పీల‌ను ప‌క్క‌న పెట్టారు. వీరిలో నంద్యాల, శ్రీస‌త్య‌సాయి, క‌డ‌ప‌, నెల్లూరు, ప‌ల్నాడు, కృష్ణా జిల్లాల ఎస్పీలు ఉన్నారు. వీరికి ఎక్క‌డా పోస్టింగు ఇవ్వ‌కుండా డీజీపీ కార్యాల‌యంలో రిపోర్టు చేయాల‌ని ఆదేశించారు.

ఈ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు ఉన్న‌తాధికారుల‌తో భేటీ అయ్యారు. ఈ స‌మావేశానికి అందుబాటులో ఉన్న మంత్రుల‌ను కూడా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా భ‌విష్య‌త్తు పాల‌న‌పై చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు. “ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి జెట్ స్పీడే. మీ అంత‌ట మీరే పుంజుకోవాలి. ఇక్క‌డ స్పూన్ ఫీడింగ్ ఉండ‌దు.“ అని చెప్పారు. అంతేకాదు.. పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని.. వ‌చ్చే రెండు మూడు మాసాల్లో ప‌నులు కూడా పుంజుకుంటాయ‌ని తెలిపారు. అప్ప‌టికి కూడా వేగం పుంజుకోక పోతే.. ప్ర‌జ‌లు అన్నీగ‌మ‌నిస్తున్నార‌ని.. వ్యాఖ్యానించారు. నిరంత‌రం ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌ని మంత్రుల‌ను ఆదేశించారు.

సంక్షేమ ప‌థ‌కాల‌ను స‌క్ర‌మంగా అందించాల‌ని, అభివృద్ధిని కూడా చేయాల‌ని  క‌లెక్ట‌ర్ల‌ను, శాంతి భ‌ద్ర‌త‌ల‌ను మ‌రో లెవిల్‌కు తీసుకువెళ్లాల‌ని ఎస్పీల‌ను ఆయ‌న ఆదేశించారు. ఈ విష‌యంలో వెనుక‌బ‌డితే.. ఉపేక్షించేది లేద‌న్నారు. ఒక‌వేళ కాదు.. కూడ‌దంటే.. మీరు అక్క‌డే ఉండిపోతార‌ని వ్యాఖ్యానించారు. అనేక స‌మ‌స్య‌లు ఉన్నా.. సంక్షేమాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని.. అనేక పెట్టుబ‌డులు కూడా తీసుకువ‌స్తున్నామ‌ని చెప్పారు. ఇలాంటి స‌మ‌యంలో మ‌రింత వేగంతో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త‌తో ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించారు.