విద్యార్థులు, యువత ఉద్యమాలతో అట్టుడికిన నేపాల్‌లో పరిస్థితులు శుక్రవారం ఓ మోస్తరు సర్దుబాటు దారి పట్టాయి. ఉద్యమ కారులతో మాజీ ప్రధాని ప్రచండ సహా.. సామాజిక వేత్తలు చర్చలు జరిపారు. ఈ క్రమంలో ప్రస్తుత పార్లమెంటును రద్దు చేయడం తోపాటు.. దేశంలో తమ డిమాండ్లను నెరవేర్చాలన్న ఒప్పందం కుదిరింది. ఆ వెంటనే తొలి హామీ అయిన పార్లమెంటును రద్దు చేశారు. అనంతరం.. ఇతర డిమాండ్లను కొత్త ప్రభుత్వం నెరవేర్చనుందని ఉద్యమకారులతో జరిగిన చర్చల్లో తేల్చి చెప్పారు. ఫలితంగా నూతన ప్రభుత్వం ఏర్పాటుకు జెన్-జడ్ ఉద్యమకారులు అంగీకారం తెలిపారు.
ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్న నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కిని తాత్కాలిక ప్రధాన మంత్రిగా నియమించేందుకు ఉద్యమకారులు అంగీకరించారు. అయితే.. ఆమె నియామకాన్ని తాత్కాలికంగానే పేర్కొనాలని కోరారు.(గతంలో బంగ్లాదేశ్ అల్లర్ల సమయంలోనూ.. ఇలానే తాత్కాలిక ప్రధాన మంత్రిని నియమించారు. ప్రస్తుతం కూడా ఆయనే కొనసాగుతున్నారు.) ఈ క్రమంలో జస్టిస్ సుశీల కర్కి.. శుక్రవారం రాత్రి తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన ప్రధాన ప్రాధాన్యాలు.. దేశంలో శాంతిని నెలకొల్పడమేనని చెప్పారు. దీనికి అవసరమైన సాయాన్ని పొరుగు దేశాల నుంచి కూడా కాంక్షించనున్నట్టు తెలిపారు.
ఇప్పటికిప్పుడుదేశంలో శాంతి నెలకొనేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. మంత్రి వర్గ కూర్పు విషయంపై నా అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పరోక్షంగా ఉద్యమకారులను ఉద్దేశించి ప్రధానమంత్రి సుశీల కర్కి వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. సుశీల కర్కిపై నేపాల్ ప్రజలకు సదభిప్రాయం ఉంది. అవినీతికి వ్యతిరేకంగా, ముఖ్యంగా రాజకీయ అవినీతికి, రాచరికానికి కూడా వ్యతిరేకంగా ఆమె అనేక పోరాటాలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా కూడా.. ప్రభుత్వ అవినీతిని దునుమాడారు. ఒకానొక సమయంలో ఆమెను పదవీచ్యుతురాలిని చేసేందుకు నేపాల్ పార్లమెంటు ప్రయత్నించిందంటే.. ఆమె ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న మహిళో అర్థమవుతుంది.
మన దగ్గరే చదవి..
సుశీల కర్కి.. భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం.. నేపాల్ లోని త్రిభువన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం అభ్యసించారు. వృత్తి రీత్యా నిఖార్సుగా ఉండడమే కాకుండా.. నేపాలీల పట్ల ఉదారతను ప్రదర్శించారు. రాచరిక నిర్ణయాలను అనేకం కొట్టివేశారు. ప్రభుత్వం దయతో వ్యవహరించాలని.. పౌరుల హక్కులకు, ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలని.. భావప్రకటనా స్వేచ్ఛకు పెద్దపీట వేయాలని సుశీల కర్కి.. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు అనేక చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. అంతేకాదు.. ఆమెను విమర్శించే వారు కూడా.. మెచ్చుకున్న తీర్పులు ఉన్నాయంటే అతిశయోక్తికాదు. నిప్పులాంటి మహిళగా పేరొందిన జస్టిస్ సుశీల.. నేపాల్‌కు తాత్కాలిక ప్రధాని కావడంతో పరిస్థితులు సర్దుబాటు చేసుకుంటాయన్న వాదన వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates