అప్పుడు కుక్కలు.. ఇప్పుడు కెమెరాలు: సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు ప‌రిధిలో కొన్ని విష‌యాల‌పై ఆంక్ష‌లు విధిస్తూ.. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇటీవ‌ల వీధి కుక్క‌లు సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ‌లోకి రాకుండా నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. కోర్టు సిబ్బంది ఎవ‌రూ కుక్క‌లకు ఆహారం పెట్ట‌రాద‌ని కూడా కోర్టు నిషేధం విధించింది. వీధికుక్క‌లు లోప‌లికి రాకుండా సిబ్బందికి కొన్ని సూచ‌న‌లు చేసింది. ఈ ప‌రంప‌రలో తాజాగా సాధార‌ణ వ్య‌క్తుల నుంచి న్యాయ వాదుల వ‌ర‌కు అనుస‌రించాల్సిన విధానాల‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఉత్త‌ర్వులు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ‌లో ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు, న్యాయ‌మూర్తులు తిరిగే ప్రాంతాన్ని హైసెక్యూరిటీ జోన్‌గా పేర్కొంటారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ముఖ ద్వారా నుంచి కోర్టు ఆవ‌ర‌ణ‌కు ఉన్నా ఆరు మార్గాల‌ను కూడా హై సెక్యూరిటీ జోన్లుగానే పేర్కొంటారు. వీటి ద‌గ్గ‌ర నిల‌బ‌డి మీడియా క‌థ‌నాలు, ఇంట‌ర్వ్యూలు ప్ర‌సారం చేస్తుంది. అదేవిధంగా కోర్టుకు వ‌చ్చేవారు ఫొటోలు తీసుకుంటారు. సెల్ఫీలు తీసుకుంటారు. కొంద‌రు యూట్యూబ‌ర్లు వీడియోలు, రీల్స్ కూడా చేస్తుంటారు. ఇక‌, ఏదైనా సంచ‌ల‌న కేసుకు సంబంధించి కోర్టు తీర్పు ఇస్తే.. జాతీయ మీడియా నుంచి స్థానిక మీడియా వ‌ర‌కు కూడా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌ను అక్క‌డి నుంచే ఇస్తారు.

అయితే.. ఇలా చేయ‌డం ద్వారా కోర్టు భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొన్న సుప్రీంకోర్టు.. తాజాగా వాటన్నింటిపైనా నిషేధం విధించింది. మీడియా ఇంటర్వ్యూలు, ప్రత్యక్ష ప్రసారాలను హైసెక్యూరిటీ జోన్‌లో నిషేధించారు. అదేవిధంగా యూట్యూబ‌ర్ల‌కు అస‌లు అనుమ‌తి లేద‌ని పేర్కొన్నారు. ఫోన్స్‌, కెమెరా, ట్రైపాడ్‌, సెల్ఫీ స్టిక్‌ వంటి వాటిని కూడా అనుమ‌తించ‌రాద‌ని పేర్కొన్నారు. మ‌రీ ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయ‌వాదులు కూడా ఎలాంటి సెల్పీలు తీసుకునే అవ‌కాశం లేద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రుగుతుంది?

ఒక‌వేళ‌.. సుప్రీంకోర్టు ఆదేశాల‌ను ఉల్లంఘిస్తే.. మీడియా సంస్థ‌ల‌పై నెల రోజుల పాటు నిషేధం విధిస్తారు. వ్య‌క్తుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేస్తారు. న్యాయ‌వాదుల‌ను నెల రోజుల పాటు బార్ నుంచి స‌స్పెండ్ చేస్తారు. కోర్టు సిబ్బంది, రిజిస్ట్రీ, ఉన్నత అధికారులు ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే.. క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. ఎవ‌రు సెల్ఫీలు, వీడియోలు, రీల్స్ తీసినా.. నిరోధించే హ‌క్కు, అధికారాన్ని భ‌ద్ర‌తా సిబ్బందికి అప్ప‌గించారు.