ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ(ప్రైవేటు-పబ్లిక్-పార్టనర్ షిప్)కి ఇవ్వాలన్న సర్కారు నిర్ణయంపై విమర్శలు, వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మెజారిటీ రాజకీయ పార్టీలు.. ప్రజాసంఘాలు కూడా వైద్య కళాశాలల నిర్మాణాన్ని ప్రైవేటుకు అప్పగించవద్దని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. తాను ఎంతో కష్టపడి తన ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చానన్నారు. వీటిలో ఐదు కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి.. తరగతులు కూడా ప్రారంభించామని చెప్పారు.
మిగిలిన 10 కాలేజీల నిర్మాణాలను మాత్రమే కూటమి ప్రభుత్వం పూర్తి చేయాల్సివుందని.. కానీ, వీటిని ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగంగానే పీపీపీ విధానం తీసుకువచ్చారని చెబుతున్నారు. దీనిని ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకొనేది లేదని.. తాము తిరిగి అధికారంలోకి వచ్చాక.. పీపీపీలను రద్దు చేసి.. వెనక్కి తీసుకుంటామని ఇటీవల మీడియా సమావేశంలో వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై కూటమి పార్టీల నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ నాయకుడు సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో జగన్‌పై విరుచుకుపడ్డారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల కాంట్రాక్టర్లను రద్దు చేయడం జగన్ కానీ, జగన్ తాత రాజా రెడ్డి దిగివచ్చినా ఆయన వల్ల కూడా కాదని సత్యకుమార్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అభివృద్ధి విషయంలో అడ్డుకుంటాను అంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. బాబాయి గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించిన చరిత్ర జగన్ దని సత్య కుమార్ విమర్శలు గుప్పించారు. గులకరాయి, కోడి కత్తి విషయాల్లో సోషల్ మీడియాలో ద్వారా అపోహలు సృష్టించే ప్రయత్నం చేశాడని విమర్శించారు. కాంట్రాక్టర్లను జగన్ బెదిరించి తాము అధికారంలోకి రాగానే మీ అంతు చూస్తానంటే కూటమి ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చోలేదన్నారు.
నాలుగేళ్ల తర్వాత తాము అధికారంలోకి వస్తానని జగన్ కలలు కంటున్నాడని సత్యకుమార్ అన్నారు. “మీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీ లు కట్టకపోవడం వల్ల వేలమంది విద్యార్థులు నష్టపోయారు.” అని వ్యాఖ్యానించారు. 4 ఏళ్ల కాలంలో మెడికల్ కాలేజీ పూర్తి చేయకుండా జగన్ మోహన్ రెడ్డి నిద్రపోయాడుని అన్నారు. వైసీపీ ప్రభుత్వం లో చేసిన అప్పులు తీర్చడానికే మాకు సంవత్సర కాలం పట్టిందన్నారు. పీపీపీ వల్ల విద్యార్థులకు వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవన్న ఆయన కాలేజీల యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయన్నారు. కేవలం 33 ఏళ్ల కాలం మాత్రమే మెడికల్ కాలేజీ నిర్వహణ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటుందని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates