సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా) ప్రస్తుతం దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న వారికి కంటిపై కునుకు పట్టనివ్వని అంశంగా మారింది. తాము అంతా బాగానే చేస్తున్నామనిపించినా, సోషల్ మీడియాలో మాత్రం తమపై దుమ్మెత్తి పోస్తున్నారని అధికార పక్షాలు వాపోతున్నాయి. ఇక అంతా బాగుంటే ప్రజలు ఎందుకు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు అన్నది సామాజిక ఉద్యమకారులు, తటస్థుల మాట. దీంతో ప్రభుత్వాలకు సోషల్ మీడియా అంటేనే వెగటు పుడుతోంది. ఫలితంగా విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు పెడుతున్నారు.
తాజాగా ఈ వ్యవహారం తెలంగాణలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఓ వ్యక్తి చేసిన విమర్శనాత్మక పోస్టులపై మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటిపై సదరు వ్యక్తి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు పోలీసులపై విరుచుకుపడింది. “స్పృహ ఉందా?” అని ఒక సందర్భంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. “కేసులు పెట్టడం అంటే కళ్ళు మూసుకుని పెడుతున్నారా? ఏది కేసో ఏది కాదో తెలియని స్థితిలో ఉన్నారా?” అని నిప్పులు చెరిగింది. సోషల్ మీడియాలో రాజకీయపరమైన విమర్శలు చేయడం తప్పుకాదన్న గత సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించింది.
దాంతో ఇక నుంచి జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులకు తేల్చి చెప్పింది. కేవలం విమర్శనాత్మక పోస్టుల కారణంగా క్రిమినల్ చర్యలు కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పరువు నష్టం, ద్వేషపూరిత ప్రసంగం, హింసను ప్రేరేపించడం, శాంతి భద్రతలకు భంగం కలిగించడమే ఆరోపణలుగా ఉంటేనే విచారణ కొనసాగించవచ్చని చెప్పింది. అంతేకాదు, ముందుగా విచారణ చేపట్టకుండానే కేసులు నమోదు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
స్వీయ నియంత్రణ ముఖ్యం!
సామాజిక మాధ్యమానికి ముకుతాడు వేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నించింది. ఐటీ చట్టాన్ని తీసుకువచ్చింది. కానీ దీనిని సుప్రీంకోర్టు తప్పుబట్టడంతో మార్పులు చేసింది. అంతేకాదు, ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శల కారణంగా నమోదైన కేసులు కూడా ఎత్తేయాలని ఆదేశించింది.
అయితే స్వీయ నియంత్రణ అవసరం లేదా? అంటే ఖచ్చితంగా కావాలి. సామాజిక ఉద్యమకారులు, విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేయడం, మహిళలపై అశ్లీల వ్యాఖ్యలతో విరుచుకుపడడం సరికాదని అంటున్నారు. భావప్రకటన స్వేచ్ఛ ఆధారంగా కోర్టులు తీర్పులు ఇస్తున్నా, రేపు ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని గుర్తిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. స్వేచ్ఛ మంచిదే అయినా, దీనికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని ప్రతి బాధ్యతాయుత పౌరుడు గుర్తించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates