2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలకు ముందు వై నాట్ 175 అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న జగన్…ఘోర ఓటమి తర్వాత వై నాట్ అపోజిషన్ అంటూ లేని, రాని ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదన్న సంగతి జగన్ కూ తెలుసు. అయినా సరే ప్రతిపక్ష హోదా కావాలని జగన్ చిన్న పిల్లలు మారాం చేసినట్లు డిమాండ్ కమ్ మారాం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభా వేదికపైన జగన్ కు చంద్రబాబు చురకలంటించారు.
రాజకీయాల్లో ఓనమాలు తెలియని వాళ్లు ప్రతిపక్ష హోదా కావాలని అడుతున్నారని, కానీ, ప్రతిపక్ష హోదా ప్రజలిచ్చేదని…తీసుకుంటే వచ్చేది కాదని పరోక్షంగా జగన్ కు చురకలంటించారు. తనను ముఖ్యమంత్రిని చేసింది ప్రజలని, జగన్ కు ప్రతిపక్ష నేత హోదా దక్కకుండా చేసింది కూడా ప్రజలేనని చెప్పారు. జగన్ అసెంబ్లీకి రావాలని ప్రజలంతా కలిసి క్లాస్ తీసుకోవాలని కోరారు. శాసన సభకు రాకుండా రప్పా రప్పా అని రంకలేస్తున్నారని వైసీపీ నేతలకు చురకలంటించారు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది సీబీఎన్, పవన్ కల్యాణ్ అని వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు, తప్పులు, పాపాలు, అక్రమాలు, వేధింపులు, దోపిడీలు, దౌర్జన్యాలు చేసిందని చంద్రబాబు అన్నారు. ఆ అప్పుల, తప్పుల లెక్క తేలుస్తామని అన్నారు. విధ్వంసమే ఎజెండాగా గత ప్రభుత్వం పాలన సాగించిందని విమర్శించారు. జనసేన, బీజేపీ, టీడీపీల కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తుందని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates