ఏపీలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీల విజయోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా, అర్బన్ నియోజకవర్గంలో నిర్వహించిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో ఇదే ఉమ్మడి జిల్లాకు చెందిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్.. సంచలన వ్యాఖ్యలతో ఆకట్టుకున్నారు. ఆయనకు సభలో ప్రసంగించేందుకు స్వల్ప సమయమే ఇచ్చినా.. కీలక వ్యాఖ్యలతో వైసీపీని టార్గెట్ చేస్తూ.. మాటల తూటాలు పేల్చారు.
వైసీపీ సర్కారుకు అభివృద్ధి తెలియదని.. హత్యలు మాత్రమే తెలుసునని వ్యాఖ్యానించిన కదిరి ఎమ్మెల్యే సభికుల్లో సంచలన ఉత్సాహం నింపారు. ముఖ్యంగా జగన్ సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్యను ప్రస్తావించిన ఆయన.. పవిత్ర కదిరి పట్టణం.. ఆధ్యాత్మికతకు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుందని, అయితే.. వైసీపీ నాయకులు ఈ పవిత్ర కదిరిని కూడా.. నాశనం చేశారని వ్యాఖ్యానించారు. వివేకానందరెడ్డి దారుణ హత్యకు ఉపయోగించిన గొడ్డలిని కదిరిలోనే కొనుగోలు చేశారని అన్నారు.
వారు అపవిత్రం చేసిన కదిరి నియోజకవర్గాన్ని సీఎం చంద్రబాబు ఇటీవల నీటిని వదిలి పవిత్రం చేశా రని ప్రశంసలు గుప్పించారు. ఫ్యాక్షన్ జాడతెలియని కదిరిని కూడా.. వైసీపీ నాయకులు ఫ్యాక్షన్ జోన్ గా తయారు చేసేందుకు ప్రయత్నించారని.. దీనిని తాము సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. వైసీపీ జాడలు లేకుండా చేస్తామని హామీ ఇస్తున్నట్టు ప్రకటించారు. కదిరి నియోజకవర్గానికి నీటిని మాత్రమే కాకుండా.. ఉపాధి కల్పనకు ఉపయోగపడే పరిశ్రమలు కూడా తీసుకువస్తున్నారని తెలిపారు.
అంతేకాదు.. కదిరిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు త్వరలోనే మాస్టర్ ప్లాన్ ప్రకటించనున్నట్టు తెలిపారు. తద్వారా.. కదిరి రూపు రేఖలు మారడంతోపాటు.. కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి మరిన్ని వన్నెలు తీసుకురానున్నట్టు చెప్పారు. కాగా.. ఎక్కడా తన ప్రసంగంలో అతిశయోక్తులకు పోకుండా మాట్లాడిన స్వల్ప సమయంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు కందికుంట. దీంతో ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత.. కూడా సభలో చప్పట్లు కొద్దిసేపు మార్మోగాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates