ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ఫొటోలు ఉంటే తప్పేంటని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. మరీ ముఖ్యంగా “డిప్యూటీ సీఎం ఫొటో ఉంటే మీకేంటి బాధ?” అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. రాజకీయ వైరుధ్యాలకు.. రాజకీయ దుమారాలకు హైకోర్టును వేదికగా చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయిం దని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
ఏపీలో గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు ఫొటోలు సహా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జీవో విడుద ల చేసింది. దీనికి సంబంధించిన కారణాలు చెప్పలేదు. కానీ, అంతర్గతంగా మాత్రం.. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించడంతో ఆయన ఫొటోను కూడా కార్యాలయాల్లో పెట్టాలని నిర్ణయించి.. ఆ మేరకు నిర్ణయించింది.
అయితే.. పవన్ కల్యాణ్ ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. ఓ రాజకీయ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గతంలోనే ఒకసారి విచారణ జరిగింది. అయితే.. అప్పట్లో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు గడువు కోరారు. తాజాగా బుధవారం జరిగిన విచారణలో హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత.. ప్రభుత్వ కార్యాలయాల్లో సర్కారుకు సంబంధించిన వారి ఫొటోలను పెట్టుకోవడం తప్పుకాదని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం కూడా.. ప్రధాని, హోం మంత్రి ఫొటోలను చాలా కార్యాలయాల్లో వినియోగిస్తోందన్న ప్రభుత్వం తరఫు వాదనలను పరిగణనలోకి తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి ఫొటోలు పెట్టడం తప్పుకాదని తెలిపింది. దీనిని రాజకీయంగా చూడాలని అనుకుంటున్న పిటిషనర్ దీనికి హైకోర్టును వేదికగా చేసుకోవడం ఎందుకని ప్రశ్నించింది. ఇలాంటి వాటి విషయంలో తీవ్రంగా స్పందిస్తామని తెలిపింది. అంతేకాదు.. పది మంది ప్రజలకు మేలు జరిగే వాటికి సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయాలని పేర్కొంటూ.. సదరు పిటిషన్‌ను తోసిపుచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates