శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో మూలకు విసిరేసినట్టు ఉండే కీలకమైన నియోజకవర్గం ఎచ్చర్ల. సముద్రానికి ఆనుకుని ఉండే ఈ నియోజకవర్గం నుంచి గడిచిన ఎన్నికల్లో నడుకుదుటి ఈశ్వరరావు విజయం సాధించారు. బిజెపి తరఫున పోటీ చేసిన ఆయన 29 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో వైసిపి నేత గొర్లె కిరణ్ కుమార్ ను ఓడించి గెలుపు గుర్రం ఎక్కారు. వాస్తవానికి ఉన్నత విద్యావంతుడైన ఈశ్వరరావు గత ఏడాది కాలంలో వివాదాలకు కేంద్రంగా నిలిచారు అన్నమాట వినిపించింది. బిజెపి లోనే ఉంటూ ఆయన టిడిపి నేతలతో స్నేహం చేశారని అంటారు.
టిడిపి వారికి అందుబాటులో ఉన్నారని, ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేశారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, అదేవిధంగా స్థానికంగా కూడా పంచాయతీలు, గ్రావెల్ అక్రమాలు, వంటివి కూడా ఈశ్వరరావును ఇబ్బంది పెట్టాయి. అయితే తాజాగా ఆయన ప్రజలకు చేరువ అయ్యేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. నమస్తే ఎచ్చర్ల టైటిల్ తో గత వారం నుంచి ప్రజలకు చేరువ అవుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి నియోజకవర్గంలోని ప్రాంతాలను ఎంపిక చేసుకుని రోజుకో ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అక్కడి సమస్యలు తెలుసుకుంటున్నారు.
స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కరించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే బలమైన ఎచ్చర్ల నియోజకవర్గంలో టిడిపి నేతలు తమ హవాను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. గతంలో మాజీ మంత్రి కళా వెంకట్రావు ఈ నియోజకవర్గంలో చక్రం తిప్పారు. ఇప్పటికీ ఆయన తాలూకా ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అధికారుల నుంచి ప్రభుత్వ ఆఫీసుల్లో సిబ్బంది వరకు కూడా కళా వెంకట్రావు చెప్పిన మాట వింటున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇదే ఈశ్వరరావుకు ఆగ్రహం తెప్పిస్తోంది.
ఎమ్మెల్యే అయిన తనకు విలువ లేకుండా ఎక్కడో ఉన్న కళా వెంకట్రావు చెప్పిన ప్రకారం ఇక్కడ పనులు జరగడం ఆయనను మరింత కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమాన్ని ఎంచుకుని ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక, ఎమ్మెల్యే విషయానికి వస్తే.. ఆయన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) కలకత్తాలో చదివారు. అనంతరం ఎచ్చెర్ల లోనే విద్యాసంస్థలను స్థాపించారు.
కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతిగా ఈశ్వరరావు పేరు కూడా తెచ్చుకున్నారు. ఒకవైపు ఆ వ్యాపారాలు కొనసాగిస్తూనే మరోవైపు అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని వ్యాపారాల్లోనూ ఆయన ప్రవేశించారని తెలుస్తోంది. ఇది ఎలా ఉన్నప్పటికీ అంతర్గతంగా ఉన్న సమస్యలు ప్రధానంగా మట్టి, ఇసుక, మద్యం ఈ మూడు విషయాల్లో ఈశ్వరరావు పేరు జోరుగా వినిపించింది. ఇప్పుడు వీటి నుంచి బయట పడేందుకు అదేవిధంగా ప్రజలకు చేరువ అయ్యేందుకు టిడిపిలోని కీలక నేతల ప్రభావాన్ని తగ్గించేందుకు నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమాన్ని ఎంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి ఏ నాయకుడైనా ప్రజలకు చేరువ అయ్యారు అంటే కచ్చితంగా వచ్చే ఎన్నికలపై దృష్టి ఉంటుంది. అదేవిధంగా ప్రజల్లో తనని తాను బలోపేతం చేసుకోవాలనే లక్ష్యం కూడా ఉంటుంది. దీనికి తోడు తనపై వస్తున్న విమర్శలను పక్కనపెట్టి ప్రజానాయకుడిగా ఎదగాలన్న ఆకాంక్ష కూడా ఈశ్వరరావు లో కనిపిస్తుండడం విశేషం. ఏదేమైనా నమస్తే ఎచ్చర్ల కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రజలకు చెరువగానే ఉంటున్నారు. ఇది ఏ మేరకు ఆయనకు సక్సెస్ రేట్ పెంచుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates