`సూప‌ర్ సిక్స్`తో త్రిముఖ వ్యూహం: బాబు స్ట్రాట‌జీ ..!

టీడీపీ నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి 15 మాసాలు పూర్త‌యిన నేప‌థ్యంలో బుధ‌వారం నిర్వ హిస్తున్న సూప‌ర్ సిక్స్‌-సూప‌ర్ హిట్ కార్య‌క్ర‌మానికి అనంత‌పురం వేదిక‌గా మారింది. అయితే.. ఈ కార్యక్ర‌మం ప్ర‌ధాన ల‌క్ష్యం ఏంటో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేసిన సంక్షేమ కార్య‌క్ర‌మాలు.. ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల‌కు మ‌రోసారి వివ‌రించ‌డంతోపాటు… కూట‌మి ఐక్య‌త‌ను చాటి చెప్పేలా చేయ‌డ‌మే దీని వెనుక ఉన్న ప్ర‌ధాన ల‌క్ష్యం. ఈ క్ర‌మంలో.. దీనిని అత్యంత అట్ట‌హాసంగా నిర్వ‌హిస్తున్నారు.

ఈ ఏడాది మేలో నిర్వ‌హించిన మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని మించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంత‌పురం శివారులో ఏర్పాట్లు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. బుధ‌వారం ఉద‌యానికి పూర్తిగా ఏర్పాట్లు స‌మ‌కూరుతాయ‌ని పార్టీ నాయ‌కులు, మంత్రులు కూడా చెబుతున్నారు. ఇక‌, ఈ కార్య‌క్ర‌మానికి సీమ నుంచే కాకుండా.. కోస్తా, ఉత్త‌రాంధ్ర‌ల నుంచి కూడా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లతో పాటు.. సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను కూడా త‌ర‌లించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీలో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం నేప‌థ్యంలో ఎక్కువ మంది మ‌హిళ‌ల‌ను త‌ర‌లించ‌నున్నారు.

మూడు ప్ర‌ధాన విష‌యాలపై ఈ `సూప‌ర్ సిక్స్‌` వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతుంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. 1)  సూప‌ర్ సిక్స్ హామీలు:  ఏడాదిన్నర కాలం కూడా పూర్తికాకుండా.. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల్లో కీల‌క‌మైన 4 హామీల‌ను అమ‌లు చేసిన విష‌యం తెలిసిందే. వీటిని మ‌రింత బ‌లంగా ముందుకు తీసుకువెళ్లాల‌న్న‌ది ఈ స‌భ ప్ర‌ధాన ఉద్దేశం. త‌ద్వారా.. కూట‌మి స‌ర్కారుతో ప్ర‌జ‌ల‌కు ఎంత మేలు అన్న‌ది వివ‌రించ‌నున్నారు. 2)  వైసీపీ వ్య‌తిరేక‌ ప్ర‌చారం:  విప‌క్షం వైసీపీ చేస్తున్న వ్య‌తిరేక ప్ర‌చారానికి ఈ వేదిక ద్వారా చెక్ పెట్టే దిశ‌గా అడుగులు వేయ‌నున్నారు.

అన్ని విష‌యాల్లోనూ త‌మ‌పై వైసీపీ దాడులు చేస్తోంద‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు నుంచి జ‌న‌సేన వ‌ర‌కు చెబుతున్న మాట‌. ఈ నేప‌థ్యంలో ఈ సూప‌ర్ సిక్స్ వేదిక‌గా.. వ్య‌తిరేక ప్ర‌చారంపై శంఖం పూరించ‌నున్నా రు. 3)  కూట‌మి బ‌లం:  ఇక‌, అత్యంత కీల‌క‌మైన అంశం.. కూట‌మి పార్టీల మ‌ధ్య ఐక్య‌త‌. దీనిని మ‌రింత బ‌లంగా ప్ర‌జ‌ల‌కు నిరూపించాల‌న్న‌ది కూడా ల‌క్ష్యంగా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా మూడు పార్టీల మ‌ధ్య ఎలాంటి పొర‌పొచ్చాలు లేవ‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు. ఇలా.. మూడు కీల‌క అంశాల‌తో సూప‌ర్ సిక్స్ స‌భ‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశారు.