రాష్ట్రంలో చిత్రమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలోని నాయకులతో చేతులు కలిపి పనులు చేస్తున్నారన్నది ప్రధాన విమర్శ. ఇది గత ఏడు నెలలుగా వినిపిస్తున్నప్పటికీ.. ఇటీవల కాలంలో మరింత ఎక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇటువంటి వారికి చెక్ పెట్టేదిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. ప్రభుత్వం నుంచి చిన్నాచితక కాంట్రాక్టులు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు వాటిని వైసిపి లోని అనుకూల నాయకులతో కలిసి చేపడుతున్నారనేది ప్రభుత్వానికి అందిన సమాచారం.
అదేవిధంగా కూటమి నాయకులు చాలామంది వైసిపి నేతలతో కలిసి రాజకీయాలు చేస్తున్నారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇది సరైన విధానం కాదన్నది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ గత వైసిపి హయాంలో తమకు సహకరించారని చెబుతున్న ప్రస్తుత కూటమి నాయకులు.. వారితో కలిసి పనులు పంచుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసిపి నాయకులతో కలిసి అడుగులు వేస్తున్నారని విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వీరిలో ఒకరు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఉండటం మరింత విశేషం.
ఇలా చేయటం వల్ల వైసీపీని టార్గెట్ చేసే విషయంలో వెనుకబడి ఉండటం, అలాగే వైసిపి విధానాలను ఒకప్పుడు ఎండగట్టిన నాయకులే ఇప్పుడు వారితో కలిసి చేతులు కలుపుతుండటం వంటివి ప్రజల మధ్యకు చర్చగా మారాయి. ఇలాంటి వాటివల్ల సర్కారుకు చెడ్డ పేరు వస్తుందని సీఎం చంద్రబాబు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఈ తరహా పనులు మానుకోవాలని ఆయన ఇప్పటికే రెండుసార్లు సూచించారు. ఇకపై ఇలాంటి వారికి నిధులు ఆపేసి, పనులు కూడా మంజూరు చేయకూడదు అన్నది నిర్ణయం గా ఉన్నట్టు సమాచారం.
సహజంగా ప్రత్యర్థులను టార్గెట్ చేయడం అనేది ప్రభుత్వంలో ఉన్న నాయకుల పనికి ఒక ఉదాహరణ. కానీ ప్రస్తుతం ఆ పని వదిలేసి ప్రత్యర్ధులతోనే కలిసి పని చేయటం అనేది ఆశ్చర్యంగా మారింది. ఉత్తరాంధ్రలోనూ వైసీపీలోని సీనియర్ నాయకులతో కొందరు ఎమ్మెల్యేలు మిలాఖత్ అయ్యారు అన్నది విమర్శలకు దారితీస్తోంది. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయని సమాచారం.
ఇటువంటి వాటిని తక్షణం వదిలేయాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు అన్నది చంద్రబాబు చెబుతున్న మాట. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. వైసీపీ నాయకులతో చేతులు కలిపిన కూటమి నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించకూడదన్నది చంద్రబాబు ఉద్దేశం గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుంది.. ఏం చేస్తారో అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates