ఒకప్పుడు ఆయన నోరు విప్పితే విమర్శలు. నోరు విప్పితే వివాదాలు అనే మాటను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన మీడియా ముందుకు వస్తే సంచలనాలకు వేదిక అనే మాట కూడా వినిపించేది. దీంతోనే గత ఎన్నికల సమయంలో అసలు టికెట్ ఇచ్చేందుకు కూడా పార్టీ అధిష్టానం వెనకడుగు వేసింది. అటువంటి నాయకుడు ఇప్పుడు ప్రజల మనిషిగా, ప్రజల నాయకుడిగా ప్రజల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేతగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు.
ఆయనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ నాయకుడు చింతమనేని ప్రభాకర్. ఏపీ రాజకీయాల్లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్ నేతగా ఒకప్పుడు చింతమనేని ప్రభాకర్‌కు పెద్ద పేరు ఉండేది. అనేక వివాదాలు, అనేక వివాదాస్పద అంశాలు కూడా ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవి. వైసిపి హయాంలో వరుసగా 60 రోజులపాటు ఆయన జైల్లో ఉండడం, వివిధ కేసులు నమోదు కావడం తెలిసిందే. అటువంటి నాయకుడు గడిచిన 15 మాసాల కాలంలో ఒక్క వివాదానికి కూడా అవకాశం లేకుండా వ్యవహరించటం వివాదాలకు దూరంగా ఉండడం అనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది.
అంతేకాదు ఏ పండుగ వచ్చినా ఆయన ప్రజలకు చేరువవుతున్నారు. ఆయా పండుగలను అనుసరించి ఆయా వర్గాల ప్రజలకు ఆయన సహాయం చేస్తున్నారు. కానుకలు ఇస్తున్నారు. ప్రజలకు అందుబాటులో కూడా ఉంటున్నారు. ఇక మహానాడు సమయంలో ఆయన చేసిన హడావిడి సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళింది. ఆయన ప్రశంసలు కూడా అందాయి. మరి ఇలా మారటానికి కారణం ఏమిటి? నిజంగానే ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్ ఇప్పుడు ఎందుకిలా సాత్వికంగా మారిపోయారు? అనేది ఆసక్తికర అంశం.
మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు అనేది నాయకుల్లో సహజంగా వస్తుంది. ఇటువంటి మార్పే చింతమనేనిలో వచ్చిందనేది టిడిపి వర్గాలు చెబుతున్న మాట. ఒకప్పుడు ప్రజలు ఏం చెప్పినా వినేవారు. ఏం చెప్పినా నమ్మేవారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నాయకులు ఏం చేస్తున్నారు? నాయకులు వ్యవహార తీరు ఎట్లా ఉంది? అనే విషయాలను నిశితంగా గమనిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాయకులు పనితీరు కూడా మారుతోంది. అలానే చింతమనేని ప్రభాకర్ కూడా తన పనితీరును మార్చుకున్నారని అంటున్నారు.
ప్రజలకు చేరువ అవుతున్నారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనకు తిరుగులేని విధంగా వ్యవహరిస్తున్నారనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. గత ఎన్నికల సమయంలో చివరి నిమిషం వరకు కూడా ఆయనకు టికెట్ ఇవ్వకుండా సస్పెన్స్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని ఆయన పై చంద్రబాబుకు మరింత విశ్వాసం పెరిగింది అనేది టిడిపి నేతలు చెబుతున్న మాట. మార్పు మంచిదే అన్నట్టు.. చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలిలోనూ ఆయన చేస్తున్న రాజకీయాల్లోనూ భారీ మార్పు చోటు చేసుకోవడం ఇప్పుడు నియోజకవర్గం లోనే కాకుండా రాజకీయంగా కూడా ఆసక్తిగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates