తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో) జె. శ్యామలరావుపై సర్కారు బదిలీ వేటు వేసింది. ఆయనను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా నియమించింది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించింది. ఈ మేరకు పలు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా రోడ్లు, భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేశ్ కుమార్ మీనా, అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే బదిలీ అయ్యారు.
శ్యామలరావు వ్యవహారం ఇదీ
ఐఏఎస్‌లను బదిలీ చేయడం కొత్తేమీ కాదు, ప్రభుత్వానికి ఉన్న అధికారమే అయినప్పటికీ టీటీడీ ఈవోగా సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏరి కోరి మరీ జె. శ్యామలరావును నియమించారు. ప్రస్తుతం ఆయన ఈ పదవి చేపట్టి 15 నెలలే అయ్యింది. అయితే కనీసం రెండు సంవత్సరాలు అయినా ఉంచుతారని అనుకున్నారు.
కానీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల సమయంలో తొక్కిసలాట జరగగా, సీఎం చంద్రబాబు ముందే వీరిద్దరూ వాగ్వాదానికి దిగారు.
ఆ తర్వాత తిరుపతి గోశాలలో గోవులు చనిపోయాయని వైసీపీ నేతలు చేసిన విమర్శలను ఈవో సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. అన్యమత ప్రచారాన్ని అడ్డుకోలేకపోవడం, చైర్మన్‌తో కలిసిపనిచేయకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఆయనపై అసంతృప్తి పెరిగింది.
ఇటీవల చంద్రగ్రహణం సందర్భంలో చైర్మన్‌తో కలిసి ఆలయానికి తాళాలు వేసే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా ఉద్దేశపూర్వకంగా శ్యామలరావు హాజరు కాలేదని ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ పరిణామాల క్రమంలో వివాదాలకు కేంద్రంగా ఉన్నారన్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని శ్యామలరావును సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates