ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కుమారుడు రాజా రెడ్డి రాజకీయ ఎంట్రీపై ఆమె స్పందించారు. త్వరలోనే రాజారెడ్డి రాజకీయాల్లో వస్తాడని చెప్పారు. కడప జిల్లా నుంచే తాత గారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోరావాలని రాజా కూడా అనుకుంటున్నట్టు షర్మిల వ్యాఖ్యానించారు. అయితే.. ఏ నియోజకవర్గం అనే విషయంపై షర్మిల స్పందించలేదు. ప్రస్తుతం ఉన్న రాజకీయాలను రాజా అధ్యయనం చేస్తున్నాడని.. త్వరలోనే అవసరాన్ని బట్టి రాజకీయంగా వస్తాడని మాత్రమే చెప్పారు.
తాజాగా షర్మిల.. కర్నూలు జిల్లాలో పర్యటించారు. కొన్నాళ్లుగా ఇక్కడి రైతులు ఉల్లిపాయల సమస్యను ఎదుర్కొంటున్నారు. భారీ ఎత్తున దిగుబడులు వచ్చినా.. కొనుగోలు చేసేవారు లేక.. ఉల్లి రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. రోజలు తరబడి ఉల్లిపాయల కొనుగోలు కోసం వేచి చూస్తున్నారు. ప్రభుత్వ అధీనంలోని మార్క్ ఫెడ్ 1260 టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. అయినప్పటికీ.. మరో 1000 టన్నుల వరకు మిగిలిపోయాయి. వీటిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వం ఉల్లిపాయలకు క్వింటాకు రూ.1200 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. అయిన ప్పటికీ.. ఎవరూ కొనుగోలు చేయడం లేదు. దీంతో వ్యత్యాసాన్ని తాము భరిస్తామని.. వ్యాపారులు ఎంతకైనా కొనుగోలు చేయొచ్చని పేర్కొంది. అయినా కూడా వ్యాపారుల నుంచి ఆశించిన మేరకు స్పందన కనిపించ డం లేదు. దీంతో రైతులు తిప్పలు పడుతున్నారు. వీరిని ఊరడించేందుకు షర్మిల కర్నూలులోని ఉల్లిపాయల మార్కెట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
ఉల్లి రైతులకు.. ప్రభుత్వం అన్యాయం చేస్తోందని..ఈ ఏడాది దిగుబడి ఎక్కువగా వస్తుందని తెలిసినా.. కొనుగోలు కు ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. మద్దతు ధరలను రూ.1200 ప్రకటించడం దారుణమని కనీసం 3000 చొప్పున నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తాము రైతులకు అండగా ఉంటామని చెప్పారు. ప్రతి పాయను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఒత్తిడి పెంచుతామని అన్నారు. ఈ సమయంలోనే రాజారెడ్డి రాజకీయ ఎంట్రీపై కామెంట్స్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates