మీడియాకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్‌!

బీఆర్ఎస్ నాయ‌కుడు, ఎమ్మెల్యే కేటీఆర్ మీడియాను ఉద్దేశించి కీల‌క హెచ్చ‌రిక‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి అనుకూలంగా తొత్తులుగా మారుతున్నార‌ని మీడియా సంస్థ‌ల‌పై ఆయ‌న నిప్పులు చెరిగారు. అయితే.. ప్ర‌జ‌లు కూడా చూస్తున్నార‌ని.. ఈ విష‌యం తెలుసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం మీడియాపై కూడా ఒత్తిడి తెస్తోందని, కొంద‌రు య‌జ‌మానులు లొంగిపోయార‌ని, అందుకే ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను ఎత్తి చూప‌డం లేద‌ని వ్యాఖ్యానించారు.

మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న అంటూ.. వేల కోట్లు సీఎం రేవంత్ రెడ్డి దోచుకున్నార‌ని కేటీఆర్ ఆరోపించారు. అదేవిధంగా హైద‌రాబాద్‌లోని చ‌ర్ల‌పల్లిలోనే 12 వేల కిలోల డ్ర‌గ్స్ త‌యారు అవుతుంటే.. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు స‌ర్కారు వ్య‌వ‌హ‌రించింద‌ని.. దీని వెనుక‌ కూడా భారీ ఎత్తున సొమ్ములు చేతులు మారాయ‌న‌ని.. దీనిలోనూ సీఎం రేవంత్ కు వాటాలు అందాయ‌ని తాము అనుమానిస్తున్నామ‌ని.. అందుకే మ‌హారాష్ట్ర పోలీసులు కూడా ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా నేరుగా ఇక్క‌డ నెల రోజులు ఆప‌రేష‌న్ చేప‌ట్టార‌ని చెప్పారు.

తాము అధికారంలో ఉన్న‌ప్పుడు..అక్క‌డ అవినీతి జ‌రిగింది.. ఇక్క‌డ అవినీతి జ‌రిగింద‌ని రాసిన ప‌త్రికలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాయ‌ని ప్ర‌శ్నించారు. అసలు ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టులు ఏమ‌య్యార‌ని అన్నారు. ప్ర‌భుత్వానికి, ప్ర‌భుత్వం ఇచ్చే యాడ్స్‌కు తొత్తులుగా మారార‌ని.. అయితే.. ఇవ‌న్నీ తామే కాదు.. ప్ర‌జ‌లు కూడా గ‌మ‌నిస్తున్నార‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికైనా.. మీడియా త‌న తీరును మార్చుకోవాల‌ని సూచించారు.

“ప్ర‌జ‌లు కేవ‌లం మ‌మ్మ‌ల్నే కాదు.. మీడియాను కూడా గ‌మ‌నిస్తున్నారు. ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పులు రాయ‌రు. ఎంత‌సేపూ.. అధికారం పోయిన కేసీఆర్ ఏం చేస్తున్న‌డో రాస్తారు. వేల కోట్లు, వంద‌ల కోట్లు మింగుతున్నా.. అటువైపు క‌న్నెత్తి చూడ‌రు. తొత్తులుగా మారారా?. ఇవ‌న్నీ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. మూసీ కుంభ‌కోణంపై ఎంత మంది వార్త‌లు రాస్తారో మేమూ చూస్తాం.” అని వ్యాఖ్యానించారు.