ఇదొక షాకింగ్ పరిణామం. తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. మంగళవారం దేశ ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తరఫున సీపీ రాధాకృష్ణన్, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి తలపడుతున్న ఈ పోరులో తటస్థ పార్టీలపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకోగా.. వీరిని దూరంగా ఉంచే ప్రయత్నాల్లో బీజేపీ నాయకులు తలమునకలయ్యారు.
తమకు ఓటు వేయకపోయినా.. ఫర్వాలేదు.. కాంగ్రెస్ మిత్రపక్షాల అభ్యర్థికి మాత్రం ఓటు వేయొద్దని తేల్చి చెప్పారు. దీనికి అనుగుణంగానే.. బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తాజాగా బీఆర్ఎస్ ఓ ప్రకటన జారీ చేసింది. తాము ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని పేర్కొంది. అయితే.. దీనికి బలమైన కారణాలు ఏవీ పేర్కొనలేదు. వాస్తవానికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 4 ఓట్లు ఉన్నాయి. లోక్‌సభలో బీఆర్ఎస్‌కు ప్రాతినిధ్యం లేకపోయినా.. రాజ్యసభలో ఉంది.
రాజ్యసభలో బీఆర్ఎస్ తరఫున పార్థసారథిరెడ్డి, కెఆర్ సురేష్‌రెడ్డి, దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్రలు ఉన్నారు. వీరి ఓట్లు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకంగా మారాయి. ఇవి కాంగ్రెస్‌కు పడితే.. ఆ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. అయితే.. తాజా నిర్ణయంతో వీరంతా ఎన్నికలకు దూరంగా ఉంటారు. అంటే.. ఒకరకంగా అధికార పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు బీఆర్ఎస్ మేలు చేస్తోందన్న వాదన వినిపించేలా ఈ నిర్ణయం ఉండడం గమనార్హం.
కాంగ్రెస్ తరఫున సుదర్శన్ రెడ్డి గెలుస్తారా.. గెలవరా.. అనేది పక్కన పెడితే.. అసలు పోటీ ఇచ్చే స్థాయిలో కూడా లేకపోతే.. అది ఎన్డీయేకు మేలు చేసినట్టే కదా.. అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అనూహ్య నిర్ణయం తీసుకోవడం ద్వారా.. పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తోందని చెబుతున్నారు. మరి దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి వాదన వినిపిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates