ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి.. ఈ నెల 10వ తేదీ(బుధవారం)నాటికి 15 నెలలు నిండుతున్నాయి. ఈ క్రమంలో కూటమి బలాన్ని మరింత పెంచుకునేందుకు, ప్రస్తుతం ఉన్న బలాన్ని ప్రజల ముందు చాటేందుకు మూడు పార్టీలు సర్వసన్నద్ధమవు తున్నాయి. గత 2024 ఎన్నికల సమయంలో టీడీపీ-బీజేపీ-జనసేనలు ఉమ్మడిగా ప్రజల మధ్యకు వెళ్లాయి. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చాయి. ఉమ్మడిగానే సీట్లు పంచుకున్నాయి. అధికారంలోకి వచ్చాక ఉమ్మడిగానే పదవులు కూడా పంచుకున్నాయి. ఎక్కడో క్షేత్రస్థాయిలో చిన్న చిన్న విభేదాలు వివాదాలు మినహా కూటమి బాగానే ఉంది.
ఇక, ప్రభుత్వం పరంగా కూడా కూటమి నాయకులు కలసి కట్టుగానే ముందుకు సాగుతున్నారు. ఎవరూ విభేదించుకోకపోగా.. ఉన్నతస్థాయిలో కీలక నేతలు తరచుగా ఉమ్మడి కార్యక్రమాలకు హాజరువుతున్నాయి. ఢిల్లీ పెద్దలతోనూ సానుకూల సంబంధాలను కొనసాగిస్తున్నారు. దీంతో కూటమి పార్టీల బలం స్పష్టంగా తెలుస్తోంది. ఇక, భవిష్యత్తులోనూ కూటమి పార్టీలు కలిసే ఉంటాయన్న సంకేతాలు ఇచ్చేందుకు.. వచ్చే నాలుగేళ్ల పాలనను మరింత ప్రజారంజకంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 10న అనంతపురం వేదికగా.. ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో ఈ 15 మాసాల కాలంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతోనే సరిపుచ్చకుండా.. భవిష్యత్తు కార్యాచరణను కూడా వినిపించనున్నారు. మరింత కట్టుదిట్టమైన బంధంతో ముందుకు సాగాలన్నది కూటమి పార్టీల నేతల ముఖ్య ఉద్దేశం. క్షేత్రస్థాయిలో కొన్ని కొన్ని పొరపాట్లు, ఇబ్బందులు వచ్చినా.. వాటిని అక్కడికే పరిమితం చేయడంతోపాటు.. రాష్ట్రంపై వాటి ప్రభావం పడకుండా చూస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా పార్టీల అధినేతల స్థాయిలో కూటమి బలంగా ఉందన్న విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. తద్వారా.. భవిష్యత్తు రాజకీయ వ్యూహాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు.
ఇదొక్కటే కాకుండా.. ప్రజలకు మరింతగా సేవలు అందించేందుకు కూడా.. ఈ వేదిక ద్వారా కూటమి ప్రభుత్వం సంకల్పం చెప్పుకొంది. వాస్తవానికి కూటమి అనగానే ఏడాదిలోనే పొరపొచ్చాలు వచ్చే పరిస్థితి ఉంది. గతంలోనూ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ, ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా.. ముందుకు సాగాలన్నది, వచ్చే ఎన్నికల నాటికి కూడా వైసీపీకి అవకాశం లేకుండా సర్కారును ఏర్పాటు చేసుకోవాలన్నది కూటమి నాయకుల వ్యూహం. అందుకే బుధవారం నిర్వహించే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్రం నుంచి కూడా నాయకులు వస్తున్నట్టు తెలిసింది. ఇక, రాష్ట్రస్థాయిలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ నాయకులు పాల్గొంటారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates