విద్యార్థులకే కాదు.. రాజకీయాల్లోకి వచ్చిన వారికి.. ఉన్నవారికి కూడా గురువులు ఉంటారనే విషయం తెలిసిందే. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా.. రాజకీయ గురువులు కూడా మారిపోతున్నారు. ఒకప్పుడు.. జాతీయ నాయకుడిగా ఉన్న జయప్రకాష్ నారాయణ్ కు దేశవ్యాప్తంగా రాజకీయ శిష్యులు ఉండేవారు. ఇప్పటికీ .. చాలా మంది తమ గురువు జయ ప్రకాష్ నారాయణ్ అనే చెప్పుకొంటారు. రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. తాము ఎలా ఉన్న ప్రజల మేలు కోరుకునేవారు.
ఇలా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ గురువులు ఒకప్పుడు కనిపించేవారు. తమ గురువుల గురించి చెప్పుకొనేవారు కూడా. పుచ్చలపల్లి సుందరయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య వంటి అనేక మంది నాయకులు.. ఎంతో మందిపొలిటికల్ శిష్యులను తయారు చేశారు. వారు కూడా తమ గురువుల విషయంలో ఎంతో భక్తిని చాటుకునే వారు. గురువులకు చెడ్డ పేరు రాకుండా కూడా చూసుకునే వారు. కానీ, కాలం మారింది. నేడు.. గురువును మించిన శిష్యులు తయారవుతున్నారు.
అయితే.. ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడడం తప్పుకాదు. గురువును మించిన శిష్యులుగా పేరు తెచ్చుకోవడం ముప్పు కూడా కాదు. కానీ, ఆర్జించడంలోనూ.. ఆదిపత్యం చలాయించడంలోనూ.. గురువులను మించిపోయిన శిష్యులే ఎక్కువ మంది ఉన్నారన్నది వాస్తవం. అంతేకాదు.. గురువుకు పోటీగా ప్రత్యేక సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకునే శిష్యులు కూడా పెరిగిపోయారు. తమకంటూ.. ప్రత్యేక గుర్తింపు కోరుకునే వారు కూడా ఉన్నారు. దీంతో రాజకీయ గురువులు ఇప్పుడు వేళ్లపై లెక్కించే స్థాయి వచ్చింది.
అంతేకాదు.. గురువుల గురించి శిష్యులు చెప్పుకొనే పరిస్థితి లేకుండా పోయి.. శిష్యుల గురించి గురువుల ప్రచారం చేసుకునే దైన్యం ఆవరించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడే. కానీ, ఆయనకు ఈ మాట అంటే.. మహా చెడ్డ కోపం. ఇక, టీడీపీ నుంచి వచ్చిన కేసీఆర్ పరిస్థితి కూడా అంతే. గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్.. కూడా ఆ తాను ముక్కే. ఇలా చాలా మంది శిష్యులు నేడు కనిపిస్తారు. వారికి కావాల్సింది.. పదవులు.. ఆధిపత్యం అంతే!. నేడు గురుపూజా దినోత్సవం సందర్భంగా.. కనీసం ఇప్పటికైనా రాజకీయ గురువులను గుర్తించాల్సి ఉందన్న విషయాన్ని చెప్పడమే ఈ కథనం ఉద్దేశం.
Gulte Telugu Telugu Political and Movie News Updates