ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా, గ్రాండ్ ఓల్డ్ పార్టీ కీలక నేతగా దాదాపుగా స్థిరపడిపోయారు. అయితే ఎంత కాంగ్రెస్ పార్టీ నేత అయినా రేవంత్ కూడా గతంలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కొనసాగిన నేతే కదా. టీడీపీలో చాలా కాలం పాటు కీలక హోదాలో పనిచేశారు. తాజాగా తెలంగాణ సీఎం హోదాలో తన సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా వేమూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ గురించి అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీని అద్భుతమైన పార్టీగా అభివర్ణించిన రేవంత్… ఎంతోమందికి అవకాశాలు ఇచ్చిన గొప్ప పార్టీ అని అభివర్ణించారు.
బుధవారం నుంచి జిల్లాల పర్యటనలను ప్రారంభించిన రేవంత్ తొలి పర్యటనను తన జిల్లాలోనే మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన రెండో యూనిట్ ను ప్రారంభించిన ఆయన ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కవిత వెనుక రేవంత్ ఉన్నారని కొందరు, హరీశ్ వెనుక రేవంత్ ఉన్నారని మరికొందరు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. తాను ఎవరి వెనుక ఉండనని, తాను నాయకుడినని అని, ఎప్పుడూ ముందే ఉంటానని అన్నారు. అయినా ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ వెనుక ఎవరైనా ఉంటారా? అని కూడా ఆయన ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా దేశంలో ఉత్తమంగా రాణించిన పార్టీల గురించి చెబుతూ… జనతా పార్టీ ఎలా వచ్చిందో, ఎంత మంచి చేసినా కూడా ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయిందని తెలిపారు. ఆ తర్వాత టీడీపీని ప్రస్తావించిన రేవంత్… “టీడీపీ ఓ అద్భుతమైన పార్టీ. ఎంతో మంది కొత్తవారికి రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ రోజు ఆ పార్టీకి తెలంగాణలో ఓ సమస్య వచ్చి పడింది. అది కూడా కొందరు చేసిన కుట్రల వల్లే. టీడీపీ లాంటి పార్టీలను ఇబ్బందులు పెట్టిన పార్టీ ఇప్పుడు అవసాన దశలో ఉంది. దేవుడు, ప్రకృతి అన్నీ చూస్తూ ఉంటాయని, కర్మను ఎవరూ తప్పించుకోలేరు” అని రేవంత్ ఓ రేంజిలో అలా చెప్పుకుంటూ పోయారు.
రేవంత్ చెప్పినట్టుగానే ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా తొలి లేఖ ఇచ్చింది టీడీపీనే. ఏనాడూ టీడీపీ తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేదు. అయితే టీడీపీ నుంచే బయటకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్… టీడీపీపై తెలంగాణ వ్యతిరేక పార్టీ ముద్ర వేశారన్న వాదనలు లేకపోలేదు. అంతేకాకుండా చిన్నా చితక కేసులను చూపి తెలంగాణలో టీడీపీ అడుగుపెట్టకుండా ఎప్పటికప్పుడు అడ్డుకున్నారు. ఈ విషయాలన్నీ గుర్తుకు వచ్చాఏమో తెలియదు గానీ… బీఆర్ఎస్ పేరు ఎత్తకుండానే తెలంగాణలో టీడీపీని ఇబ్బంది పెట్టింది ఆ పార్టీనేనని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates