మీ పంచాయతీల్లోకి నన్ను లాగొద్దు: రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయ్యారని మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. వారిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని, కాళేశ్వరం అవినీతి అంటూ కేసీఆర్ పై సీబీఐ విచారణకు పురిగొల్పారని ఆరోపించారు. అందుకే, హరీష్ రావు పేరును రేవంత్ రెడ్డి ప్రస్తావించడం లేదని, కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ ను మాత్రమే రేవంత్ విమర్శిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే కవిత కామెంట్లకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను హరీష్, సంతోష్ ల వెనుక లేనని, చెత్తగాళ్ల వెనుక తానెందుకు ఉంటానని రేవంత్ ఘాటుగా బదులిచ్చారు.

కవిత వెనుక తానున్నానని కొందరంటున్నారని, ఆమె మాత్రం హరీష్ వెనుక తానున్నానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నేను ఎవరి వెనుక లేనని, మీ పంచాయతీల్లోకి నన్ను లాగొద్దంటూ కవితకు హితవు పలికారు. 1000 రూపాయల నోటు మాదిరిగానే బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోబోతోందని జోస్యం చెప్పారు. గతంలో ఇతరులను ఎదగనీయని వారు ఇప్పుడు పంచాయతీలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. వాళ్లను వాళ్లే పొడుచుకుంటున్నారని అన్నారు. అవినీతి సొమ్ము పంచుకునే క్రమంలో గొడవలు వచ్చాయని, కుటుంబ పంచాయతీలలలోకి తనను లాగొద్దని అన్నారు.

చేసిన పాపాలు ఎక్కడకీ పోవని, వాళ్లు అనుభవించి తీరాల్సిందేనని చెప్పారు. తాను నాయకుడినని, తన వారి ముందుంటానని అన్నారు. మీరంతా దిక్కుమాలిన వారని, తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారని, అటువంటి వారి వెనుక ఎవరుంటారని అన్నారు. తాను పాలమూరు జిల్లా ప్రజలు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటానని అన్నారు. తనకు కేసీఆర్ కుటుంబ, కుల పంచాయతీలు తీర్చే సమయం, ఆసక్తి లేదని అన్నారు. అందులోకి దయచేసి తనను లాగొద్దని అన్నారు.