అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ఈపాటికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలో ఉన్న తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడమో.. లేక ప్రచార కార్యక్రమాల్ని పర్యవేక్షించడమో చేస్తుండాలి. ఐతే ఎంతో సమాలోచనలు చేసి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన పవన్.. రెండు రోజులు తిరిగే లోపు యుటర్న్ తీసుకున్నాడు.
తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులంతా బీజేపీకి మద్దతుగా నిలవాలని, జనసేన బరిలో ఉండదని తేల్చేశారు. దీనిపై రెండు రోజుల పాటు పెద్ద రచ్చే జరిగింది. విమర్శల్ని పట్టించుకోకుండా పవన్ తన పనిలో తాను ఉండిపోయారు. ఇప్పుడు ఆయన హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం విశేషం. పవన్‌తో పాటు పార్టీ అగ్ర నేత నాదెండ్ల మనోహర్ సైతం హస్తినకు బయల్దేరుతున్నారు.
చాలా కాలం తర్వాత పవన్‌కు బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీలో నంబర్ 2 అనదగ్గ హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ పవన్‌కు దొరికిందట. బీజేపీతో పొత్తు పెట్టుకున్న సమయంలో కూడా పవన్‌కు మోడీ-షాల్లో ఒక్కరినీ కలిసే అవకాశం రాలేదు. అలాంటిది ఇప్పుడు షా పిలిచి అపాయింట్మెంట్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనను పోటీ నుంచి తప్పించి బీజేపీకి మద్దతు ప్రకటించడం పట్ల షా ఇంప్రెస్ అయ్యారని.. అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లో సహకారం అందించాలని కోరబోతున్నట్లు తెలుస్తోంది.
జనసేన నేరుగా అభ్యర్థిని నిలబెట్టి గెలిచే పరిస్థితి లేదని, అలా కాకుండా తమ అభ్యర్థికి మద్దతు ఇస్తే విజయం సాధించవచ్చని.. ఇందుకు ప్రతిఫలంగా భవిష్యత్తులో తమ పార్టీ నుంచి జనసేనకు సహకారం ఉంటుందని షా చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి హస్తిన పర్యటన ముగిశాక పవన్ ఏం మాట్లాడతాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates