ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం రాజంపేటలో పర్యటించిన సందర్భంగా రాష్ట్ర ప్రతిపక్ష(ప్రధాన కాదు) పార్టీ వైసీపీ అధినేతను ఉద్దేశించి గట్టి సవాలే రువ్వారు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలని.. ఏ విషయంపైనైనా చర్చించేందుకు తాము ‘సిద్ధం’గా ఉన్నామని.. చెప్పారు. ఈ సందర్భంగా ఆయన గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్, ఆయన నాయకులు సిద్ధం – సిద్ధం అంటూ.. చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. “అప్పట్లో సిద్ధం అన్నారుగా.. ఇప్పుడు సిద్ధమేనా? రండి అసెంబ్లీలో తేల్చుకుందాం. అభివృద్ధి నుంచి సంక్షేమం వరకు.. కోడికత్తి డ్రామా నుంచి గులకరాయి నాటకాల దాకా.. వివేకానందరెడ్డి దారుణ హత్య వరకు అన్నింటిపైనా చర్చిద్దాం.” అని జగన్‌కు చంద్రబాబు సవాల్ రువ్వారు.
ఈ వ్యవహారంపై తాజాగా వైసీపీ స్పందించింది. అయితే.. నేరుగా జగన్ కాకుండా.. ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్, గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు సవాల్ ఏడ్చినట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన సవాల్ ప్రజలకు ఉపయోగపడేనా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని.. కొందరికే తల్లికి వందనం పథకం అందిందని, రైతులు వరదలు, వర్షాల కారణంగా నానా తిప్పలు పడుతున్నారని, ఇక, యూరియా అందక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని సజ్జల చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ క్రమంలో ఆయా అంశాలపై చర్చకు సిద్ధమని చంద్రబాబు చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై ఎవరైనా చర్చిస్తారని.. అన్నారు. కానీ, అసెంబ్లీని రాజకీయ వేదిక చేసుకుని, ప్రజాధనంతో నడిచే సభను రాజకీయాలకు ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పడం.. ఆయన 30 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవానికి ప్రతీకా? అని నిలదీశారు. ఏదైనా ఉంటే.. తాము సవాల్ విసరాలని.. కానీ, సీఎం స్వయంగా రా.. తేల్చుకుంటాం! అంటే.. ఎవరైనా నవ్వుతారా? లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబును చూసి ఇతర నాయకులు కూడా రెచ్చిపోతున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. ఈ తరహా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై చర్చిస్తామని అంటే.. బాగుండేదన్నారు.
సభకు వెళ్తారా?
ఇక, తమ పార్టీ తరఫున గెలిచిన 11 మంది సభ్యులు సభకు వెళ్తారా? లేదా? అనే విషయంపై సజ్జల క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయాన్ని పార్టీ నేత చూస్తారని.. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదాఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో తమకంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు తెచ్చుకుని.. కూటమి ప్రబుత్వంలో భాగస్వామ్యం కాని పార్టీ ఉంటే.. అప్పుడు తాము ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగేవారం కాదని అన్నారు. కానీ, అలా లేనప్పుడు.. ఉన్న ఒకే ఒక్క పార్టీకి ప్రధాన ప్రతిపక్షం ఇవ్వకపోవడంలో ఆంతర్యం కూడా చంద్రబాబు చెప్పాలని కోరారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉందని.. దీనిపై పార్టీ అధినేత తీసుకునే నిర్ణయానికి ఎమ్మెల్యేలు కట్టుబడి పనిచేస్తారని సజ్జల వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates