ముందే వేడెక్కించేసిన చంద్ర‌బాబు.. !

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. అసెంబ్లీ స‌మావేశాల‌ను ముందే వేడెక్కించేశారు. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ స‌మావేశాల‌కు రావాల‌ని .. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను అసెంబ్లీ స్పీక‌ర్ .. అయ్య‌న్న పాత్రుడు ఇప్ప‌టికే ఆహ్వానించారు. అయితే.. జ‌గ‌న్ వ‌స్తారా? రారా ? అనేది ఇప్ప‌టికీ స‌స్పెన్ష‌న్‌లోనే ఉంది. ఇదిలావుంటే.. ఈ స‌మావేశాల‌కు సంబంధించి… చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీశాయి.

తాజాగా రాజంపేటలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. అసెంబ్లీ స‌మావేశాల‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్యలు చేశారు. “ద‌మ్ముంటే.. స‌భ‌కురావాలి ” అని చంద్ర‌బాబు వైఎస్ జ‌గ‌న్‌ను ఉద్దేశించి స‌వాల్ రువ్వారు. దీంతో ఒక్క‌సారిగా రాజ‌కీయాలు వేడెక్కాయి. చంద్ర‌బాబు వైపు నుంచి క్లారిటీ వ‌చ్చేసింది. వైసీపీ ఎలాంటి అం శం లేవ‌నెత్తినా.. తాము చ‌ర్చించేందుకు రెడీగా ఉన్నామ‌న్న సంకేతాలు ఇవ్వ‌డం కాదు.. తేల్చి చెప్పేశారు. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌రకు త‌మ‌కు మైక్ ఇవ్వ‌ర‌ని.. చెబుతూ వ‌చ్చిన జ‌గ‌న్‌కు ఆయ‌న భారీ కౌంట‌ర్ ఇచ్చారు.

సాధార‌ణంగా స‌భ‌లో ఏదైనా అంశంపై చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌తిప‌క్షానికి మైక్ ఇస్తారు. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబే స్వ‌యంగా రావాల‌ని కోరుతున్న స‌మ‌యంలో ఈ మైకు మ‌రింత ఎక్కువ స‌మ‌యం ఇచ్చే అవ‌కాశం ల‌భిస్తుంది. దీనిని జ‌గ‌న్ స‌ద్వినియోగం చేసుకునే అవ‌కాశం వ‌దులుకుంటే.. అది చంద్ర‌బాబు కు మ‌రో ఆయుధంగా మారే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏ అంశంపై అయినా.. అంటూ.. చంద్ర‌బాబే చెప్పిన ద‌రిమిలా.. ఇప్పుడు జ‌గ‌న్‌కు కూడా మంచి చాన్స్ ల‌భించింది.

తాను లేవ‌నెత్తుతున్న అనేక అంశాల‌ను చంద్ర‌బాబుకు సంధించే అవ‌కాశం కూడా జ‌గ‌న్‌కు ఏర్ప‌డింది. సంక్షేమ ప‌థ‌కాల నుంచి అభివృద్ధి వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు చ‌ర్చ‌కు రెడీ అయిపోయారు. ఇప్పుడు వైసీపీ అధినేత‌ ఇంట్లో కూర్చొని మీడియా మీటింగుల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయితే.. అది శోభించ‌దు. పైగా.. స్వ‌యంగా చంద్ర‌బాబే స‌వాల్ రువ్వ‌డం ఇది ఫ‌స్ట్ టైమ్‌. దీనిని ప్ర‌జ‌లు కూడా గ‌మ‌నిస్తున్నారు. ఇప్పుడు కూడా స‌భ‌కు వెళ్ల‌క‌పోతే.. అది జ‌గ‌న్ పిరికిత‌నానికి నిద‌ర్శ‌న‌మ‌నే చ‌ర్చ వ‌చ్చినా.. ఆశ్చ‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు పరిశీల‌కులు మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.