జగన్ తల్లి ‘జట్టు’ మార్చేశారా?

సెప్టెంబర్ 2 అంటే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం గుర్తుకు వస్తుంది. హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయారు. ఈ ఘటన జరిగి 16 ఏళ్లు అవుతోంది. తమ సొంత ఎస్టేట్ ఇడుపులపాయలో తండ్రికి సమాధి కట్టుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏటా వైఎస్ వర్థంతి, జయంతి సందర్భంగా అక్కడకు వెళ్లి తండ్రికి నివాళి అర్పిస్తుంటారు. మంగళవారం కూడా అదే జరిగింది. అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. నిన్నటిదాకా ఏపీసీసీ చీఫ్ గా కొనసాగుతున్న తన కుమార్తె వైఎస్ షర్మిల వెంట కనిపించిన జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి మంగళవారం జగన్ తో కలిసి కనిపించారు.

సోమవారమే కుటుంబ సమేతంగా పులివెందుల చేరుకున్న జగన్… రాత్రికి ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకుని అక్కడే బస చేశారు. విజయమ్మ కూడా నిన్ననే ఇడుపులపాయ వచ్చినట్లు సమాచారం. మంగళవారం ఉదయమే తండ్రికి నివాళి అర్పించేందుకు బయలుదేరిన జగన్ వెంట ఆయన తల్లి విజయమ్మ కూడా తన భర్తకు నివాళి అర్పించేందుకు సాగారు. ఈ సందర్భంగా వైఎస్ సమాధి వద్ద తన కుమారుడు జగన్ కు విజయమ్మ ఆశీస్సులు కూడా అందజేశారు. జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి, జగన్ సమీప బంధువర్గం అంతా కింద మోకాళ్లపై కూర్చోగా… కుర్చీ మీద కూర్చుని విజయమ్మ భర్తకు నివాళి అర్పించారు.

ఆ తర్వాత జగన్ అండ్ కో అక్కడి నుంచి నిష్క్రమించగా… మరికాసేపటికే తండ్రికి నివాళి అర్పించేందుకు షర్మిల తన పిల్లలతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగానూ విజయమ్మ అక్కడ కనిపించారు. అయితే జగన్ నివాళిలో ముందు వరుసలో కుర్చీలో కూర్చున్న విజయమ్మ … షర్మిల నివాళిలో మాత్రం వెనుక వరుసలో చాలా దిగాలుగా కూర్చుని కనిపించారు. షర్మిల వెంట ఆమె కుమారుడు, కోడలు, కుమార్తె, కొందరు సమీప బంధువులు ఉన్నారు. ఈ దృశ్యాలు చూసిన వెంటనే విజయమ్మ నిజంగానే షర్మిల జట్టు వీడి జగన్ జట్టులో చేరిపోయారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. గతంలో షర్మిల వెంట ఇడుపులపాయ వచ్చిన విజయమ్మ ఆ సందర్బంగా జగన్ వెంట కనిపించనే లేదు.

అంతేకాకుండా కంపెనీ షేర్ల పంచాయతీ నేపథ్యంలో కుమార్తెతో కలిసి కొడుకుపైనే కోర్టుకు ఎక్కిన విజయమ్మ.. జగన్ అండ్ కో పై ఘాటు వ్యాఖ్యలే చేశారు.ఆ వ్యాఖ్యలు విన్నవారు ఇకపై విజయమ్మ జగన్ దరి చేరరని భావించారు. కోర్టులో షర్మల, విజయమ్మలకు షాక్ తగిలింది. జగన్ కే అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ… విజయమ్మ మంగళవారం తన కుమారుడితో కలిసి కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో కుమార్తెతోనూ ఉన్నా… షర్మిలకు దూరంగా విజయమ్మ కూర్చున్న తీరు చూస్తే జగన్ జట్టులోకి విజయమ్మ చేరిపోయినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.