ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు అభినందనలు తెలిపారు. చంద్రబాబు అద్భుత పాలనా దక్షుడు అని వ్యాఖ్యానించారు. ఆయన విజన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ప్రగతి మార్గంలో నడిపించారని తెలిపారు. రాబోయే 30 ఏళ్ల కాలాన్ని ముందుగానే అంచనా వేసి చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తారని, ఇది భవిష్యత్తు తరాలకు కూడా ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయనో దార్శనికుడు, అద్భుత విజనరీ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలను ప్రగతి వైపు పరిగెత్తించేలా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయనలోని పాలనా పటిమ, పాలనపై వేసిన ముద్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. అయితే ఆయన రాజకీయ జీవితం అంత ఈజీగా సాగిపోలేదని పవన్ తెలిపారు. అనేక ప్రతిఘటనలు ఎదుర్కొన్నారని, ప్రతి సంఘర్షణను సవాలుగా తీసుకుని ముందుకు సాగారని చెప్పారు. ఒక నాయకుడి గొప్పదనం మాటల్లో కాదు, చేతల్లో కనిపిస్తుంది అనడానికి చంద్రబాబు ప్రధాన ఉదాహరణ అని పేర్కొన్నారు. తెలంగాణలో హైదరాబాదు మేటి నగరంగా విశ్వ ఖ్యాతి సొంతం చేసుకోవడం వెనుక చంద్రబాబు అజరామర కృషి దాగి ఉందని తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది యువత ఇప్పుడు ప్రపంచ దేశాల్లో పనిచేసేందుకు వెళ్తున్నారంటే అది చంద్రబాబు కృషి ఫలితమేనని చెప్పారు. ఐటీని రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే కాకుండా గ్రామాలకు కూడా విస్తరించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. శరీరకష్టం స్పురింపజేసేలా మహిళలు, రైతులకు ఆయన ఎంతోగానో తోడ్పాటును అందించారని తెలిపారు. రైతు బజార్ల ఏర్పాటు, డ్వాక్రా సంఘాలు, వెలుగు ప్రాజెక్ట్, మీ సేవా కేంద్రాలు వంటివి ఆయన పాలనలోనే రూపుదిద్దుకున్నాయని గుర్తు చేశారు.
రాష్ట్ర విభజనతో ఏపీ ఎంతో నష్టపోయిందని, రాజధాని కూడా లేని పరిస్థితిలో బస్సులోనే ఉండి పాలన సాగించారని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి వేలాది ఎకరాలను తీసుకుని అద్భుత నగరం సృష్టి కోసం ఆయన పడుతున్న శ్రమ వృథా పోదని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో అనేక ఇబ్బందులు పడ్డా, తెలుగు వారి కోసం వాటిని ఓర్చుకుని దృఢ సంకల్పంతో ముందుకు సాగారని పేర్కొన్నారు.
కేంద్రంతో ఎప్పటికప్పుడు సత్సంబంధాలను కొనసాగిస్తూ ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని కొనియాడారు. దార్శనికుడిగా ఆయన పాలన కొన్ని తరాలకు మార్గదర్శకంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates