నిజమేనండోయ్…. నేటి రాత్రి, రేపు పగలంతా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకే చోట అంటే…మరీ ఒకే చోట అని కాదు… ఒకరికి ఒకరు అత్యంత సమీపంలోనే పర్యటించనున్నారు. ఈ ఆసక్తికర పరిణామానికి జగన్ సొంత జిల్లా కడప జిల్లానే వేదిక కానుంది. సోమవారం మధ్యాహ్నానికే కడప జిల్లాలోని తన సొంతూరు పులివెందుల చేరుకున్న జగన్ తన క్యాంపు కార్యాలయంలో పార్టీ కేడర్ తో సమావేశం అయ్యారు. ఇక లోకేశ్ సోమవారం రాత్రికి కడప చేరుకుంటారు.
కడప జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం రాత్రికి కడప చేరుకోనున్న మంత్రి లోకేశ్…నగర పరిధిలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో రాత్రి బస చేస్తారు. ఇక మంగళవారం ఉదయం కడపకు అత్యంత సమీపంలోని కమలాపురం నియోజకవర్గం చేరుకోనున్న లోకేశ్… అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. అంతకుముందే ఆయన నియోజకవర్గ క్రియాశీల కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలను ముగించుకుని సాయంత్రానికి ఆయన కడప జిల్లా నుంచి బయలుదేరనున్నారు.
ఇదిలా ఉంటే…. సెప్టెంబరు 2 దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి అన్న విషయం తెలిసిందే. పులివెందుల పరిధిలోని ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద జగన్ నివాళి అర్పించనున్నారు. అందుకోసమే జగన్ పులివెందుల వచ్చారు. చాలాకాలంగా బయటకు కనిపించకుండా సాగిన జగన్… తన తండ్రి వర్ధంతిని పురస్కరించుకుని నేరుగా బెంగళూరు నుంచి పులివెందుల వచ్చినట్లు సమాచారం. తండ్రికి నివాళి అర్పించిన తర్వాత జగన్ తిరిగి పులివెందుల వెళతారా? లేదంటే అటునుంచి అటే బెంగళూరు బయలుదేరతారా? అన్నది తెలియరాలేదు.
మొత్తంగా వైసీపీ అధినేత, టీడీపీ యువనేత ఇద్దరూ ఒకే సమయంలో ఒకే జిల్లాలో పర్యటిస్తుండటం గమనార్హం. అటు జగన్, ఇటు లోకేశ్ ఒకేసారి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కమలాపురంతో పాటు ఇడుపులపాయలోనూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే… లోకేశ్ పర్యటిస్తున్న కమలాపురం నియోజకవర్గం వేరెవరిదో కాదు… జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. అయితే మొన్నటి ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి టీడీపీ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ టీడీపీ నేత పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates