మాజీ మంత్రి హరీష్ రావు, మేఘా అధినేత కృష్ణారెడ్డిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వారివల్లే తన తండ్రి కేసీఆర్ కాళేశ్వరం కేసులో సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చిందని షాకింగ్ ఆరోపణలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే సమయంలో హరీష్ రావు ఇరిగేషన్ శాఖా మంత్రి అని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వల్లే హరీష్ రావును మంత్రి పదవి నుంచి తొలగించారని కవిత చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
హరీష్ రావు, సంతోష్‌ల వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆమె ఆరోపించారు. దమ్ముంటే వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ నలిగిపోతున్నారని, ఇలాంటివారిని ఆయన ఎందుకు భరించాలని ప్రశ్నించారు.
తాను ఇలా మాట్లాడడం వల్ల రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగే అవకాశముందని అన్నారు. తన తండ్రి కేసీఆర్‌పై సీబీఐ విచారణ పడ్డ తర్వాత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ మహా నాయకుడని, ఆయనపై సీబీఐ కేసు పెట్టడంతో తన కడుపు రగిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకుల వైఖరి వల్లే తన తండ్రి కేసీఆర్‌పై కేసు పెట్టారని అన్నారు.
కేసీఆర్ గారి కాలిగోటికి రేవంత్ సరిపోరని, అటువంటిది కేసీఆర్‌ను వేలు చూపించి మాట్లాడుతూ ఆయనపై కేసులు పెడుతున్నారని చెప్పారు. తనపై ఎన్నో కుట్రలు చేసినా భరించానని అన్నారు.
తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు గుప్పించినా తాను మౌనంగా ఉన్నానని అన్నారు. కానీ, ఈ రోజు తన తండ్రిపై కేసు పెట్టడంతో తాను హరీష్ రావు, కృష్ణారెడ్డిల గురించి మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates