హరీశ్, సంతోష్ లే అసలు నిందితులు: కవిత

కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఈ వ్యవహారంపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో రాజకీయ మంటలను రాజేసింది. నిన్నటిదాకా విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత సోమవారం వచ్చీరాగానే ఈ వ్యవహారంపై పెను కలకలమే సృష్టించారు. జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కవిత… కాళేశ్వరంలో అవినీతికి పార్టీ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో పాటు కేసీఆర్ వెన్నంటి సాగే రాజ్యసభ మాజీ సభ్యుడు, కేసీఆర్ కు అత్యంత సమీప బంధువు సంతోష్ రావులే కారణమని ఆమె ఓ బాంబు లాంటి వ్యాఖ్య చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అందులో అవినీతిలో హరీశ్ రావుకు పాత్ర లేదా? అని ప్రశ్నించిన కవిత… బీఆర్ఎస్ సెకండ్ టెర్మ్ లో హరీశ్ కు కొంత కాలం పాటు మంత్రి పదవే ఇవ్వలేదని, ఆ తర్వాత కూడా ఇరిగేషన్ శాఖ కాకుండా ఇతర శాఖలను అప్పగించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో వీరిద్దరి కారణంగానే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటుకున్నాయని కూడా ఆమె ఆరోపించారు. తన తండ్రికి అవినీతి చేయాల్సిన అవసరం లేదని, అసలు అలాంటి తత్వం కూడా తన తండ్రిది కాదని ఆమె చెప్పుకొచ్చారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించే క్రమంలో ప్రాణాలనే పణంగా పెట్టిన కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారంటే నమ్మేదెలా? అని ఆమె ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక స్థానాల్లో పనిచేసిన ఇద్దరు ఇంజినీర్ల ఇళ్లపై దాడులు జరిగిన సమయంలో వందలాది కోట్ల రూపాయల నిధులు లభ్యమయ్యాయని, వాటి వెనుక ఎవరు ఉన్నారో దర్యాప్తు చేయాలని కవిత డిమాండ్ చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావుల మీద చర్యలు తీసుకునే దమ్ముందా అంటూ ఆమె తెలంగాణ సర్కారును ప్రశ్నించారు. అసలు ఆ ఇద్దరి జోలికి వెళ్లే ఉద్దేశమే లేనట్లుగా సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎందుకంటే… హరీశ్, సంతోష్ ల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆమె మరో సంచలన వ్యాఖ్య చేశారు. 

పార్టీ, తన తండ్రి కేసీఆర్ గురించి ప్రస్తావిస్తూ కవిత భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన కేసీఆర్ మీదకు ఇప్పుడు సీబీఐ కేసులు నమోదు అవుతున్నాయంటే తనకు చాలా బాధగా ఉందని కన్నీరు పెట్టుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో అసలు పార్టీ ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని కూడా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తనపై పార్టీ నుంచే వస్తున్న విమర్శలను ప్రస్తావించిన కవిత… ఇకపై తాను సైలెంట్ గా ఉండేది లేదని తేల్చిచెప్పారు. చిల్లర మాటలు మాట్లాడితే తాట తీస్తానని కూడా ఆమె వార్నింగులు ఇచ్చారు. మొత్తంగా ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో అప్పటికే రేగిన రాజకీయ వేడిని మరింతగా పెంచేసిందని చెప్పక తప్పదు.