ఏపీ సీఎం చంద్రబాబు మహిళలకు మరిన్ని వరాలు ప్రకటించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న రెండు కీలక పథకాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో సూపర్ 6 హామీల్లో ఒకటైన తల్లి వందనం పథకంలో మిగిలి పోయిన లబ్దిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
జిల్లాకు 200 నుంచి 300 మధ్యలో పెండింగు దరఖాస్తులు ఉన్నాయి. వీటిలో అర్హులైన ప్రతి తల్లికి ఎంత మంది పిల్లలు ఉన్నా, నిధులను రెండు మూడు రోజుల్లోనే వారి వారి ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు.
ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మరింత విస్తరించారు. ఎంత మంది మహిళలు బస్సుల్లో ఎక్కినా అడ్డు చెప్పవద్దని, దీనికి నిర్ణీత సంఖ్య అంటూ ఏమీ లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు.
అదేవిధంగా బస్టాండ్‌లో టికెట్ తీసుకుని నిర్ణీత స్టేజ్‌కు వెళ్లే బస్సుల్లో ఇప్పటి వరకు ఉచితం లేదు. ఇప్పుడు తాజాగా ఆయా బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని చెప్పారు.
దీనికి తోడు మహిళలు ఎక్కడా నలుగురుకు మించి ఉంటే వారు చెయ్యి ఎత్తితే బస్సు ఆపి ఎక్కించుకోవాలని సూచించారు. ఆ ప్రాంతంలో బస్ స్టాప్ లేదన్న వంకతో తప్పించుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. అయితే ఈ సంఖ్య నలుగురు ఉన్నప్పుడు మాత్రమే అమలు చేయాలన్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు బస్సులను ఉచితంగానే నడపాలని ఆదేశించారు. మొత్తంగా 36 ఘాట్ రోడ్లు ఉన్నాయి. వాటన్నింటికీ మహిళలను ఉచితంగా అనుమతించాలన్నారు.
అసౌకర్యానికి చెక్!
ఇక ఆర్టీసీ బస్సుల్లో తోటి ప్రయాణికులు ఇబ్బందులు పడేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
ఇటీవల శ్రీకాకుళంలో ఓ మహిళ, పురుషుడు సీటు కోసం తలెత్తిన వివాదంలో చెప్పులతో కొట్టుకున్నారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు ఆ ఇద్దరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు.
ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తోటిమహిళలకు ఇబ్బంది కలిగించకుండా ప్రవర్తించాలని ఆయన సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates