దేశంలో ఓట్ల దొంగలు: రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓట్ల చోరీ ఉద్యమాన్ని చారిత్రక ఘటనగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దీనిని మున్ముందు కూడా మరింత తీవ్రంగా కొనసాగించనున్నట్టు ఆయన తెలిపారు.

ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల గ్యాప్‌లో రేవంత్ రెడ్డి కేరళలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కీలక నాయకుడు కేసీ వేణుగోపాల్ రాసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అలెప్పీలో జరిగిన విద్యార్థుల‌కు ఎంపీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేవలం ఓటు పొందగానే సరిపోదని, మీ ఓటును మీరు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని వ్యాఖ్యానించారు.

దేశంలో ఓట్ల దొంగలు ఉన్నారని, వారి నుంచి ఎవరికివారే భద్రంగా తమ ఓటు హక్కును ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా తాము దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నామని చెప్పారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఓట్ల దొంగలను ప్రజల ముందు నిలబెట్టామని తెలిపారు.

బీహార్‌లో ఏకంగా 65 లక్షల మంది ఓట్లను తొలగించారని, ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. దీనిని రాహుల్ గాంధీ అన్ని ఆధారాలతో వెలుగులోకి తెచ్చారని, కానీ బీజేపీతో కుమ్మక్కైన ఎన్నికల సంఘం దీనికి ఆధారాలు కావాలని అడుగుతోందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

అదే బీహార్‌లో పాకిస్థానీలకు కూడా ఓటు హక్కు కల్పించారని, దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను తారుమారు చేయడం, లక్షల సంఖ్యలో కొత్తవారికి ఓటు హక్కు కల్పించడం వంటి పనులు బీజేపీ కోసం చేస్తున్న మేలు కాదా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరముందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత, ఎంపీ కేసీ వేణుగోపాల్‌పై రేవంత్ రెడ్డి ప్రశంసలు గుప్పించారు. ఆయన కేరళ వాసే అయినా దేశవ్యాప్తంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. 2006లో ప్రారంభించిన ఎంపీ మెరిట్ అవార్డులకు ఎంతో ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు.

10వ తరగతి, 12వ తరగతి విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.