మోడీ తర్వాత.. ఆ ఛాన్స్ మళ్లీ లోకేష్‌కే!

ఔను.. మీరు చదివింది నిజమే. ప్రస్తుతం ప్రధాన మంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ తర్వాత ఓ గొప్ప అవకాశాన్ని దక్కించుకున్న మంత్రిగా నారా లోకేష్ రికార్డు సృష్టించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఘనంగా నిర్వహించే కార్యక్రమానికి నారా లోకేష్‌కు ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏటా స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం (ఎస్‌వీపీ)ని ఘనంగా నిర్వహిస్తుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులను ఏరికోరి ఆహ్వానిస్తుంది. వారి స్ఫూర్తిని తమ దేశానికి కూడా చాటుతుంది.

ఈ క్రమంలో ఈ ఏడాది కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్‌కు ఆస్ట్రేలియా ప్రత్యేక ఆహ్వానం పంపించింది. ఎస్‌వీపీలో పాల్గొనాలని కోరింది. ఇతర వివరాలను త్వరలోనే తెలియజేయనున్నట్టు భారత్‌లోని ఆస్ట్రేలియా దౌత్య కార్యాలయం నుంచి మంత్రి నారా లోకేష్‌కు అందిన సమాచారం. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల దృష్టిని ఆకర్షించడమే కాకుండా ఉత్తమ నాయకుడిగా మరింత గుర్తింపు సాధ్యమవుతుంద‌ని ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.

ఎందుకు పిలిచారు?

రాష్ట్రంలో మానవ వనరులు, విద్య, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న సమూల సంస్కరణలు.. ఇష్టపడి చదివే విధానాలను ప్రోత్సహించడం పట్ల ఆస్ట్రేలియా ప్రభుత్వం అచ్చరువొందింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను తమ దేశానికి ఆహ్వానించింది. వచ్చే నెలలో ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. కాగా.. ఉమ్మడి ఏపీ సహా విభజిత ఏపీ నుంచి కూడా ఈ ఆహ్వానం అందుకున్న ఏకైక నాయకుడు నారా లోకేష్ కావడం గమనార్హం.

గతంలో..

గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోడీకి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇలానే ఆహ్వానం పంపింది. ఆయన వెళ్లారు కూడా. 2001లో నిర్వహించిన స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్‌కు మోడీని ఆహ్వానించినట్టు తాజాగా పంపించిన ఆహ్వాన పత్రికలో ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తు చేసింది. ఇప్పుడు భారత్ నుంచి మంత్రి నారా లోకేష్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది.