నా నియోజకవర్గంలో వారు (వైసీపీ) పాగా వేయాలని అనుకున్నారు. అందుకే సినిమా సెట్టింగులు వేసి కుప్పం నియోజకవర్గంలో నీరు పారించామని డ్రామాలు ఆడారు. ఎక్కడి నుంచో నీరు తీసుకువచ్చి ఇక్కడ పారించి రిబ్బన్లు కట్ చేశారు. కానీ, జగన్ తిరిగి విమానం ఎక్కేసరికి ఆ నీళ్లన్నీ ఇంకిపోయాయి. ఇదీ ఆనాటి పాలన. కానీ ఇప్పుడు వరద ప్రవాహం మీరు చూస్తున్నారు. మనసు పెట్టి పనులు చేస్తున్నాం. కృష్ణమ్మను తీసుకువచ్చాం. రైతులకు, ఇక్కడి ప్రజలకు కూడా నీరిచ్చాం. ఇదీ మా నిబద్ధత అని సీఎం చంద్రబాబు అన్నారు.
కుప్పం నియోజకవర్గంలో కృష్ణానది నీటి ప్రవాహానికి ఆయన స్వాగతం పలుకుతూ జలహారతి ఇచ్చారు. అనంతరం అక్కడే నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ నేతలు, ఆ పార్టీ పాలనపై నిప్పులు చెరిగారు. రాయల సీమకు ఏదో చేస్తామని ఉత్తుత్తి హామీలు గుప్పించిన జగన ఆనాడు చేసింది ఏమీ లేదని, కేవలం 2 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకొన్నారని చెప్పారు. కానీ తాము రాయల సీమ ప్రాజెక్టులకు 1250 కోట్ల రూపాయలను కేటాయించామని తెలిపారు. దీంతో సీమను రత్నాల సీమగా మార్చనున్నామన్నారు.
అసాధ్యాలను సుసాధ్యం చేయడం మాతోనే సాధ్యమవుతుంది. అసత్యాలు, నాటకాలు, డ్రామాలు వారి సొత్తు అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కుప్పం నియోజకవర్గంలో నీరు పారేసరికి వారి ముఖాల్లో సంతోషం కరువైందని, వారు జీర్ణించుకోలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. మల్యాల మండలం నుంచి పరమసముద్రం వరకు కృష్ణానీటిని తీసుకువచ్చామని చెప్పారు. దీనికి 27 ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టామని చెప్పారు. కుప్పానికి రెండేళ్ల కంటే ముందే కృష్ణా పుష్కరాలు వచ్చాయి అని వ్యాఖ్యానించారు.
బుల్లెట్ లా దూసుకెళ్తా!
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పనిచేయాలని అనుకున్నా అది ప్రజల కోసమేనని, ఈ విషయంలో బుల్లెట్‌లా దూసుకువెళ్తానని చెప్పారు. పవిత్రమైన సంకల్పం ఉంటే అన్ని పనులు విజయవంతం అవుతాయని అన్నారు. నదుల అనుసంధానంలో తెలంగాణ నాయకులు కలిసి రావాలని సూచించారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నీటి లభ్యత మరింత పెరుగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న రాజకీయాలు కట్టిపెట్టాలని హెచ్చరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates