అజారుద్దీన్ ఒకటి తలస్తే మరొకటైందే!

కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెట్ మహమ్మద్ అజారుద్దీన్ ఒకటి తలస్తే మరొకటైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో ఆయన మరోసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు. ఇక్కడి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ టికెట్‌పై అజారుద్దీన్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు.

రెండు నెలల క్రితం కూడా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానంతో చర్చించానని, ఈ టికెట్ తనకే కేటాయిస్తారన్న నమ్మకం ఉందని, ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడ విజయం దక్కించుకుంటానని కూడా అజారుద్దీన్ చెప్పుకొచ్చారు. ఇక గతంలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ కూడా ఈ టికెట్‌ను అజారుద్దీన్‌కే ఇవ్వడం మంచిదని భావించారు. మంత్రివర్గంలో మైనారిటీలకు అవకాశం ఇవ్వలేదుకాబట్టి ఇలా అయినా అవకాశం ఇవ్వాలని అనుకున్నారు.

కానీ గత నెల రోజులుగా అనూహ్యంగా పరిణామాలు మారుతున్నాయి. అజారుద్దీన్ స్థానంపై అనేక మలుపులు తిరుగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ నాయకులతో తరచుగా భేటీ నిర్వహిస్తూ “జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికిచ్చినా అందరం కలిసి పార్టీ నాయకుడిని గెలిపించాలి” అని వ్యాఖ్యానిస్తున్నారు. అంటే దీనిబట్టి అప్పట్లోనే అజారుద్దీన్ వ్యవహారం డోలాయమానంలో పడింది. అయినప్పటికీ అజారుద్దీన్ మాత్రం తన పనితాను చేసుకుంటూ పోతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ టికెట్ తనదేనని, తన గెలుపు ఖాయం అని చెబుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో రాష్ట్ర కేబినెట్‌లో ఆయనను మండలికి పంపించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతిపాదించడం, మంత్రులు కూడా ఆమోదం తెలపడం రెండూ జరిగాయి. ఫలితంగా జూబ్లీహిల్స్ టికెట్ అజారుద్దీన్ చేజారిపోయింది. ఆయన అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది మరొకటి. ఏదేమైనా మండలికి పంపుతున్నందువల్ల అజారుద్దీన్ హ్యాపీగా ఫీల్ అవుతారో లేక జూబ్లీహిల్స్ టికెట్ కావాలని పట్టుబడతారో చూడాలి.