సొంతవాళ్లనే హతమార్చిన డీఎన్ఏ మాది కాదు: కోటంరెడ్డి

వైసీపీ మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుత టీడీపీ నేత‌, నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి మాజీ సీఎం జ‌గ‌న్‌పై ప‌రోక్షంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. సొంత వాళ్ళని చంపించే డీఎన్ఏ తమకు లేదన్నారు. ఆస్తులు, అంత‌స్థుల కోసం.. తండ్రి సొమ్ములో వాటాల కోసం.. తోడ‌బుట్టిన వారిని వేధించి.. త‌రిమి కొట్టే త‌త్వం కూడా త‌న‌కు లేద‌ని వ్యాఖ్యానించారు. తాను అనేక ఇబ్బందులు ప‌డి రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని.. ఇబ్బందులు.. బెదిరింపులు త‌న‌కు కొత్త కాద‌ని వ్యాఖ్యానించారు.

శ‌నివారం ఉద‌యం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి.. తాజాగా వెలుగు చూసిన ఓ వీడియోపై స్పందించారు. ఈ వీడియ‌లో “నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యేను చంపేస్తే.. డ‌బ్బే.. డ‌బ్బు!“ అంటూ రౌడీ షీట‌ర్లు చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపాయి. దీనిపై ప్ర‌భుత్వం కూడా స్పందించింది. వెంట‌నే విచార‌ణ‌కు కూడా ఆదేశించింది. అయితే.. ఈ వ్య‌వ‌హారం.. రెండు వారాల కింద‌టే పోలీసుల‌కు తెలిసిన‌ప్ప‌టికీ.. త‌న‌కు చెప్ప‌క‌పోవ‌డంపైనా.. త‌న‌ను అప్ర‌మ‌త్తం చేయ‌క‌పోవ‌డంపైనా.. కోటంరెడ్డి ఒకింత ఆవేద‌న‌తో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలోనే శ‌నివారం మీడియా ముందుకు వ‌చ్చిన ఆయ‌న‌.. ఈ ప్ర‌ణాళిక వెనుక వైసీపీ ఉంద‌ని ఆరోపించారు. వైసీపీ నేత‌ల‌ను.. తాను ఎదిరించినందుకే త‌న‌ను లేపేయాల‌ని ప్లాన్ చేశార‌ని, కానీ, తాను ఎవ‌రికీ ద్రోహం చేయ‌లేద‌ని చెప్పుకొచ్చారు. రాజ‌కీయంగా విభేదాలు.. వివాదాలు త‌న‌కు కొత్త కాద‌న్నారు. గ‌తంలో వైసీపీలో ఉన్న‌ప్పుడు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాన‌ని తెలిపారు. ప్ర‌జ‌ల కోసం ఏమైనా చేసేందుకు త‌న కుటుంబం మొత్తం రెడీగా ఉంద‌ని తెలిపారు. తాను వ్య‌క్తిగ‌తంగా స్వార్థానికి పోయే వ్య‌క్తిని కాద‌న్నారు.

ఇదేస‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆస్తుల కోసం.. తోడ‌బుట్టిన వారిని త‌రిమేసే త‌త్వం త‌మ కుటుంబంలోలేద‌న్నారు. రాజ‌కీయాల కోసం సొంత వ్య‌క్తుల‌నే చంపించే వ్య‌క్తిని కూడా కాద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జ‌ల కోసం తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పిన కోటంరెడ్డి.. త‌న ఆస్తులు, అప్పుల‌ను ఎవ‌రైనా ప‌రిశీలించుకోవ‌చ్చ‌ని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ప్ర‌జ‌ల‌కు సాధ్య‌మైనంత వ‌ర‌కు సేవ చేసిన‌ట్టు వివ‌రించారు. త‌న‌పై ప్లాన్ జ‌రిగింద‌న్న విష‌యం తెలిసి ఆశ్చ‌ర్య‌పోలేద‌ని చెప్పారు. తాను ప్ర‌జ‌ల కోసం ఏమైనా చేస్తాన‌ని తెలిపారు.

ఇదిలావుంటే.. కోటంరెడ్డి హ‌త్య విష‌యంపై ప‌క్కా ప్లాన్ చేసిన‌ట్టు భావిస్తున్న‌ రౌడీషీట‌ర్ల‌లో న‌లుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. దీనివెనుక వైసీపీకి చెందిన కీల‌క మాజీ మంత్రి ఒక‌రు ఉన్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆ కోణంలోనూ విచార‌ణ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గానే తీసుకుంది. విష‌యం తెలియ‌గానే.. హోం మంత్రి అనిత‌.. కోటంరెడ్డితో మాట్లాడి.. భ‌రోసా క‌ల్పించారు.