తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వ్యవహారం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితి కోటా వంటి అంశాలపై గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఆ విషయాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవో విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంచాయతీల్లో రిజర్వేషన్ 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ జీవో విడుదల చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు సెప్టెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలన్న తీర్మానానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
దాంతోపాటు, ఇటీవల భారీగా కురిసిన వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకునే అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నారని తెలుస్తోంది. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థిక సాయం కోరే తీర్మానికీ ఆమోద ముద్ర లభించే అవకాశముంది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, టీమిండియా మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ల పేర్లను ఖరారు చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత జీవో ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయంపై బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates