ఏపీలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సంబంధించి సుప్రీంకోర్టు చిత్రమైన తీర్పు ఇచ్చింది. గతంలో దేనినైతే కోర్టు తప్పుబట్టిందో, ప్రస్తుతం మళ్లీ అదే విషయాన్ని సమర్థించడం గమనార్హం. అందుకే తాజాగా ఆదేశాలను న్యాయవాదులు, న్యాయవర్గాలు కూడా చిత్రమైన తీర్పుగా పేర్కొంటున్నారు. అంతేకాదు, ఆమె పేర్కొన్న వారికి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.
విషయం ఏంటంటే
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కుంభకోణం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఆమె గతంలో జైలులో కూడా గడిపి వచ్చారు. అయితే ఈ కేసులో తన ప్రమేయం లేదని, తాను కేవలం సంతకమే చేశానని ఆమె పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ (వైఎస్) విధాన పరమైన నిర్ణయం మేరకే తాను సంతకం చేశానని ఆమె చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ కేసు నుంచి తన పేరును తీసేయాలని ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై పలు దఫాలుగా విచారణ జరిపిన కోర్టు చివరకు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ప్రమేయం లేదని పేర్కొంటూ, ఆమె పేరును నిందితుల జాబితా నుంచి తొలగించింది. అయితే ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు సుప్రీంకోర్టులో దీనిని సవాల్ చేశారు. దీంతో అప్పటి హైకోర్టు తీర్పుపై మండిపడిన సుప్రీంకోర్టు ఈ కేసును మరోసారి విచారించాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు మళ్లీ ఈ కేసును విచారించి, నిందితుల జాబితాలో శ్రీలక్ష్మి పేరును చేరుస్తున్నట్టు పేర్కొంది.
అంతేకాదు, సీబీఐ విచారణకు కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిణామంతో షాకైన శ్రీలక్ష్మి తాజా హైకోర్టు తీర్పుపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పేరును తొలగించాలని కోరారు. లేదా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని అభ్యర్థించారు.
దీనిని శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు శ్రీలక్ష్మిని నిందితురాలిగా పేర్కొంటూ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. వాస్తవానికి సుప్రీంకోర్టు చెప్పినట్టే హైకోర్టు చేయగా, ఇప్పుడు మళ్లీ శ్రీలక్ష్మికి ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం, స్టే విధించడం చిత్రంగా ఉందని సీబీఐ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates