రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే భేటీ కానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి రాజధాని వరకు ఏర్పాటు చేసే 6 లైన్ల హైవే అంశంపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు.
ప్రధానంగా ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న రహదారి ఎక్కువ భాగం ఏపీలోనే ఉండనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. వాస్తవానికి హైదరాబాద్ నుంచి అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఉండాలనేది సీఎం చంద్రబాబు కూడా భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఫ్యూచర్ సిటీని కలుపుతూ అమరావతి వరకు రహదారి నిర్మించడం ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య అభివృద్ధి, వస్తువుల రవాణా, ప్రజా రవాణాకు ఈ రహదారి ప్రధానంగా ఉపయోగపడుతుందన్న ఆలోచన ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి భూ సమీకరణతో పాటు నిధులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. మిగిలిన 40 శాతం రెండు రాష్ట్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే భేటీ కావాలని నిర్ణయించారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ భేటీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఎక్కువ భాగం అమరావతికి కనెక్ట్ చేసే ఈ రోడ్డు ఏపీలోనే ఉండనుంది. సూర్యాపేట నుంచి అమరావతి వరకు దాదాపు 150 కిలోమీటర్ల వరకు రహదారిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా భూ సమీకరణతో పాటు నిధులను కూడా వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది.
హైదరాబాద్ వైపు చూస్తే ఫ్యూచర్ సిటీ నుంచి సూర్యాపేట వరకు కేవలం 90 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏమిటంటే, ఫ్యూచర్ సిటీని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో దానికి కనెక్టివిటీ పెంచాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఫలితంగా ఈ భూ సమీకరణకు అయ్యే ఖర్చును తెలంగాణే భరించాలని, నిర్వహణ మొత్తం తాము చూసుకుంటామని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అంటే ఆర్థిక భారాన్ని తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
దీనికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. మీ రాష్ట్రంలో ఎక్కువ భాగం రహదారి ఉంటుంది కాబట్టి ఆ ఖర్చు అంతా మీరే భరించాలని తెలంగాణ ప్రభుత్వం సూచనప్రాయంగా తెలిపింది. అయితే కీలకమైన ఫ్యూచర్ సిటీని అనుసంధానిస్తూ అమరావతిని కలుపుతున్నందున, రహదారికి అయ్యే భూ సమీకరణతో పాటు నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం ఇస్తే, ఏపీ ప్రభుత్వం 10% మేర మాత్రమే ఏర్పాటు చేస్తుందన్నది ఏపీ వైపు వాదన. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారే సూచనలు ఉన్నాయి.
ఇప్పటికే బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ వ్యవహరించిన తీరుపై ఏపీ ప్రభుత్వం ఆందోళనగా ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ అంశాన్ని పక్కన పెట్టిన స్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతిని కలుపుతూ ఏర్పాటు చేసే గ్రీన్ ఫీల్డ్ హైవే వ్యవహారం ఏ దిశలో సాగుతుందో చూడాలి.
ఈ రహదారి నిర్మాణాన్ని రెండు రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ, నిధుల సమస్య, భూసేకరణ వివాదం వంటివి రెండు ప్రభుత్వాలకు ఇబ్బందికరంగానే మారే అవకాశం ఉంది. మరి దీన్ని సానుకూలంగా పరిష్కరించుకుంటారా లేక బనకచర్ల ప్రాజెక్ట్ మాదిరిగా పరిష్కారం లేకుండా మిగిలిపోతుందా అన్నది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates