కొద్ది మందితో పెద్ద ప్లాన్: ప‌వ‌న్ వ్యూహం ఇదేనా?

జ‌న‌సేన పార్టీ వ్య‌వ‌హారాలు, ప్ర‌జ‌ల్లో ఆ పార్టీకి పెర‌గాల్సిన ఇమేజ్ స‌హా అనేక అంశాల‌పై చర్చించేందుకు డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ వేదిక‌గా సేన‌తో సేనాని కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్య‌క్ర‌మం మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. చివ‌రి రోజు బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు.

తాజాగా గురువారం ప్రారంభ‌మైన తొలిరోజు కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొన్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి ఎలా తీసుకువెళ్లాల‌నే అంశంపై చ‌ర్చించారు. పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణపై కూడా దీనిలో చ‌ర్చించారు. మంత్రులు కేవ‌లం శాఖ‌ల‌కు ప‌రి మితం కారాద‌ని, ప్ర‌జ‌ల‌ను త‌ర‌చుగా క‌లుసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అంతేకాక కార్య‌క‌ర్త‌ల‌తోనూ త‌ర‌చుగా మాట్లాడాల‌ని ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ చెప్పారు.

కొద్దిమంది కార్య‌క‌ర్త‌ల‌ను ఎంపిక చేసి ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. వీరితో ప‌వ‌న్ శుక్ర‌వారం భేటీ కానున్నారు. నియోజ‌క వ‌ర్గానికి ప‌ది మంది చొప్పున ఎంపిక చేసిన వారితో మాత్ర‌మే ఆయ‌న మాట్లాడ‌నున్నారు. ఇలా కొద్ది మందినే ఎంపిక చేయ‌డంపై కూడా పార్టీలో చ‌ర్చ జరిగింది.

కొద్ది మందే అయినా పెద్ద ప్లాన్ ప్ర‌కారం ప‌నిచేసేవారు అవుతార‌ని, బ‌ల‌మైన నాయ‌క‌త్వం అంటే పెద్ద సంఖ్యా బ‌లం కాద‌ని జ‌న‌సేన అధినేత అభిప్రాయ‌ప‌డ్డారు. బ‌ల‌మైన గ‌ళం వినిపించేవారు ఉంటే కొద్ది మంది అయినా వంద‌ల మందిని క‌దిలించే శ‌క్తితో ప‌నిచేస్తార‌ని చెప్పారు. వీరికి భ‌విష్య‌త్తులో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే అంశంపై ఇప్ప‌టికే బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు. దీని ప్ర‌కారం కార్య‌క‌ర్త‌ల‌ను నియోజ‌క‌వ‌ర్గాల వారీగా బ‌లోపేతం చేసి పార్టీని ముందుకు నడిపించాల‌ని నిర్ణ‌యించారు.

తొలి రోజు, రెండో రోజు కార్య‌క్ర‌మాలు నాలుగు గోడ‌ల‌కే ప‌రిమితం కానున్నాయి. మూడో రోజు మాత్రం బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారు. పార్టీ త‌ర‌ఫునే కాకుండా ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాలు, సంక్షేమం వంటివాటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే విష‌యంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ దిశానిర్దేశం చేయ‌నున్నారు.

ఇదిలావుంటే స‌భా ప్రాంగ‌ణానికి మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పేరుపెట్ట‌డం విశేషం. మ‌రోవైపు కూట‌మి ప్ర‌భుత్వంలో టీడీపీ దూకుడుగా ఉండ‌గా, జ‌న‌సేన కొంత వెనుక‌బ‌డింద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో వాటికి చెక్ పెట్టాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే సేన‌తో సేనాని కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు.