వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులపై మరో వ్యూహంతో ముందుకు సాగాలని టీడీపీ నిర్ణయించింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు కూడా ముమ్మరం చేసింది. ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. వైసీపీ తరఫున ఈ రెండు చోట్ల పోటీ చేసిన వారికి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ పెను దెబ్బ నుంచి వైసీపీ ఇంకా కోలుకోక ముందే మరో పెద్ద వ్యూహంతో వైసీపీకి షాకిచ్చేందుకు టీడీపీ రెడీ అయింది.
విషయం ఏంటి..
వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి సమయం ప్రకారం నిర్వహించినా నిర్వహించకపోయినా ఇబ్బంది లేదు. ప్రత్యేక అధికారులను నియమించి కొంత కాలం పొడిగించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ఆర్టీసీ ఉచిత బస్సు వంటివి మహిళల్లోను, సాధారణ ప్రజల్లోను మంచి పేరు వచ్చిన నేపథ్యంలో సమయానికే ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రెడీ చేయాలని ఇటీవల చంద్రబాబు సూచన ప్రాయంగా చెప్పారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి. అయితే ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ జగన్ సహా ఆ పార్టీ కీలక నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ పాగా వేయాలన్నది ఆలోచన. “ఎక్కడైతే గత మునిసిపల్ ఎన్నికల్లో మన జెండా కూడా పట్టుకోకుండాఅడ్డుకున్నారో అక్కడ ఇప్పుడు మన జెండానే ఎగరాలి” అన్న సంకల్పంతో టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ప్రదానంగా పుంగనూరు, పులివెందుల, గుడివాడ, గన్నవరం, మచిలీపట్నం, అనకాపల్లి తదితర కీలక మునిసిపాలిటీలు, స్థానిక సంస్థలపై యుద్ధప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటోంది.
పులివెందులపై ఫోకస్
ఇవన్నీ ఒక ఎత్తయితే పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మునిసిపాలిటీ ఇప్పుడు టీడీపీకి మరింత కీలకంగా మారింది. రెండు జెడ్పీ ఉప ఎన్నికల్లో విజయం దరిమిలా ఆ పట్టును నిలబెట్టుకోవడంతోపాటు వైసీపీని మరింత ఇరుకున పెట్టేందుకు పులివెందులలో పాగా వేయాలని నిర్ణయించింది.
దీనికి గాను నేరుగా యువనేత, మంత్రి నారా లోకేషే రంగంలోకి దిగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ తానై వ్యవహరించేందుకు స్థానిక నాయకులకు గట్టి హామీ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సో ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ ఏమేరకు అలెర్ట్ అవుతారన్నది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates