దేశంలో సంచలనం: రెండుగా చీలిపోయిన మాజీ న్యాయమూర్తులు

దేశంలో ఏది జరగకూడదో అదే జరిగింది. అత్యంత అరుదుగా మాత్రమే మీడియా ముందుకు రావాల్సిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, న్యాయకోవిదులు రెండు వర్గాలుగా చీలిపోయి మీడియా ముందుకు రావడం, ప్రకటనలు గుప్పించడం ఇప్పుడు సంచలనం గా మారింది.

న్యాయవ్యవస్థలో సుదీర్ఘ కాలం పనిచేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సమాజానికి అత్యంత ఆదర్శవంతంగా వ్యవహరిస్తారన్నది అందరూ భావించే విషయం. ముఖ్యంగా పారదర్శకతకు, నిష్కర్షకు, నిజాయితీకి వారు నిలువెత్తు దర్పణంగా మారుతారని కూడా అందరూ అనుకుంటారు.

కానీ, మారుతున్న కాలంతో వారు కూడా మారుతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో రెండు పరిణామాల విషయంలో న్యాయమూర్తులు చీలిపోయారు.

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ ఇటీవలి ఓ సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చాలని తీర్పు చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు జస్టిస్ రమేశ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు జీవితకాలంలో క్రిమినల్ కేసులు అప్పగించరాదని, ఒకవేళ ఏదైనా క్రిమినల్ కేసు అప్పగించాల్సి వస్తే వేరే సీనియర్ న్యాయమూర్తిని పక్కన కూర్చోబెట్టాలని అసాధారణ తీర్పు ఇచ్చింది.

ఈ విషయంలో దేశవ్యాప్తంగా హైకోర్టు న్యాయమూర్తులు ఎలుగెత్తారు. సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలే హైకోర్టుకు కూడా ఉన్నాయని, సుప్రీం ఎక్కువ, హైకోర్టు తక్కువ కాదంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ను వివరిస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో సుప్రీంకోర్టు జస్టిస్ రమేశ్‌పై ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకుని సవరించింది. ఇది దేశంలో అసాధారణ ఘటనగా న్యాయకోవిదులు పేర్కొన్నారు.

ఇక తాజాగా మరో సంచలనం చోటు చేసుకుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన నక్సల్స్ సానుభూతి పరుడని వ్యాఖ్యానించారు. అంతేకాదు అప్పట్లోనే సుల్వాజుడుం (శాంతి దళం)ను కొనసాగించి ఉంటే ఈ పాటికి ఎప్పుడో దేశంలో నక్సల్స్ సమస్య పోయేదని కూడా చెప్పారు.

దీనిపై 18 మంది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు సోమవారం స్పందించారు. షా వ్యాఖ్యలను తప్పుబట్టారు. న్యాయవ్యవస్థను అవమానిస్తున్నారని, సుప్రీంకోర్టు సచ్చీలతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని వ్యాఖ్యానించారు. కట్ చేస్తే ఇప్పుడు ఈ న్యాయమూర్తులపై మరో 56 మంది మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విమర్శలతో విరుచుకుపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలను సమర్థించారు. తప్పుకాదన్నారు.

ఒక పోరాటం (ఉపరాష్ట్రపతి ఎన్నిక) జరుగుతున్నప్పుడు ఇరుపక్షాల మధ్య జరుగుతున్న చర్చగానే చూడాలని చెప్పుకొచ్చారు. దీంతో అసలు న్యాయమూర్తుల వ్యవహార శైలిపై చర్చ తెరమీదికి వచ్చింది. ఇలా ఎందుకు జరుగుతోందన్నది ప్రశ్న.

ఏదేమైనా దేశంలో ఎవరివల్లైనా ఆదర్శంగా ఉండాలని, ఏ వ్యవస్థ నిష్పాక్షికంగా ఉండాలని భావిస్తారో ఆ వ్యవస్థే ఇప్పుడు ప్రశ్నల బోనెక్కిందన్న జాతీయ మీడియా చర్చ ప్రస్తావనార్హం.