‘ఇక్కడుండి చెప్పడం కాదు.. జనాల్లోకి రండి’

వైసీపీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీ సీనియర్ నాయకుల నుంచి భారీ సవాలే ఎదురైంది. గత రెండురోజులుగా ఆయన పార్టీ జిల్లా స్థాయి నాయకులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు.

పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి? ఏ విధంగా పార్టీ ఇమేజ్ పెంచాలి? జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రి ఎలా చేయాలి? ఓటు బ్యాంకును తిరిగి ఎలా సొంతం చేసుకోవాలి? అనే విషయాలపై సజ్జల క్లాస్ ఇస్తున్నారు. దీనికి జిల్లా స్థాయి నుంచి పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు వచ్చారు.

సోషల్ మీడియాలో ఏ విధంగా పార్టీ ఇమేజ్ పెంచాలన్న విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డి వారికి వివరించారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యదర్శులకు పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి? టీడీపీపై ఎలా పోరాటాలు చేయాలన్న విషయాలపై గంటలకొద్దీ సమయం వారికి వివరించారు.

అయితే, ఈ సమయంలో ఒకరిద్దరు జిల్లాస్థాయిలో సీనియర్ నాయకులు రుసరుసలాడారు. “ఇక్కడుండి చెప్పడం కాదు. మీరు ఓసారి జనాల్లోకి రండి” అని సజ్జలకు సూచించారు. దీంతో ఒక్కసారిగా కార్యక్రమం వేడెక్కింది.

“ఏం జరిగింది?” అంటూ సజ్జల వారిని అడిగారు. దీనికి వారు, “ఇక్కడ నుంచి మీరు చక్రం తిప్పుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ విషయంలో సమాధానం చెప్పలేక మేము ఇబ్బందులు పడుతున్నాం. ప్రజల్లోకి వెళ్లలేక నరకం అనుభవిస్తున్నాం” అని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్నీ విమర్శించడం సరికాదని, ప్రజల్లో సానుభూతి ఉన్న కార్యక్రమాలను వదిలేయాలని, ప్రజలకు ఇబ్బందిగా ఉన్న వాటిని మాత్రమే భుజాన వేసుకోవాలని కొందరు సూచించారు.

“విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయి. దీనిపై వైసీపీ మౌనంగా ఉంది. ఈ విషయంలో పోరాటం చేస్తే ప్రజలు కలిసివస్తారు” అని కొందరు చెప్పారు.

దీనికి సజ్జల ఆసక్తికర సమాధానం చెప్పారు. విద్యుత్ ఒప్పందాలు మన హయాంలోనే జరిగాయని, ఇప్పుడు వాటి జోలికి వెళ్తే కూటమి ప్రభుత్వం తిరిగి మనల్నే టార్గెట్ చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, మీరు క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు రావాలని, ఇక్కడ కూర్చొని చెప్పడం కాదని పలువురు నాయకులు తేల్చిచెప్పారు. అనంతరం సజ్జల, “జగన్ త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారు” అని వారికి సర్ది చెప్పారు.