‘అత‌ని క‌ణ‌తకు తుపాకీ పెట్టి.. జ‌గ‌న్ బెదిరించారు’

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి వ‌ర్సెస్‌.. ప్ర‌తిప‌క్ష వైసీపీకి మ‌ధ్య వివాదం తార‌స్థాయికి చేరింది. వైసీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు పాల‌క‌మండ‌లి బోర్డు, కార్య‌నిర్వ‌హ‌ణాధికారి స‌హా.. ఇత‌ర అధికారులు దీటుగా స్పందిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో తిరుమ‌ల భ్ర‌ష్టు ప‌ట్టింద‌ని, ప‌విత్ర‌త ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌ని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా గోశాల‌లో గోవుల మృతి, తిరుప‌తిలో వైకుంఠ ద‌ర్శ‌న టోకెన్ల విష‌యంలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట వంటివి బోర్డుకు ఇబ్బందిగా కూడా మారాయి. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయిలో సాగుతున్నాయి.

ఇక‌, ఇప్పుడు తిరుమ‌ల ప‌రిధిలో ప్రైవేటు హోట‌ల్ సంస్థ ముంతాజ్‌కు స్థలం కేటాయింపు వ్య‌వ‌హారం టీటీడీకి, వైసీపీకి మ‌ధ్య మ‌రిన్ని మంట‌లు రాజేసింది. ఏడు కొండ‌ల‌ను ఆనుకుని ఉన్న ప్రాంతంలో ముంతాజ్ హోట‌ల్‌కు స్థ‌లం కేటాయించార‌ని పేర్కొంటూ.. వైసీపీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి గ‌త రెండురోజులుగా ఈ విష‌యంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా టీటీడీ బోర్డు చైర్మ‌న్ బీఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. అస‌లు తాము కాద‌ని.. వైసీపీ హ‌యాంలోనే ఏడుకొండ‌ల‌ను ఆనుకుని ఉన్న భూముల‌ను ముంతాజ్ హోట‌ల్‌కు కేటాయించార‌ని చెప్పారు.

అంతేకాదు.. ఈ విష‌యంలో స్థ‌లం తాలూకు య‌జ‌మాని, ముంతాజ్ హోట‌ల్‌కు భూమినికేటాయించ‌డాన్ని వ్య‌తిరేకించిన‌ అజ‌య్ అనే వ్య‌క్తిని అప్ప‌టి సీఎం జ‌గ‌న్ బెదిరించార‌ని బీఆర్ నాయుడు తెలిపారు. “అజ‌య్‌కు పాయింట్ బ్లాంక్‌(క‌ణ‌తి) రేంజ్‌లో తుపాకీని గురి పెట్టిన జ‌గ‌న్‌.. తీవ్రంగా బెదిరించారు. కాల్చేస్తాన‌ని హెచ్చ‌రించాడు“ అని నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు. దీంతో స‌ద‌రు వ్య‌క్తి భూములు ఇచ్చేందుకు బ‌ల‌వంతంగా ఒప్పుకొన్నాడ‌ని వ్యాఖ్యానించారు. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబుకు చెప్పి, ముంతాజ్‌కు కేటాయించిన భూముల‌ను ర‌ద్దు చేయించామ‌న్నారు.

అనంత‌రం .. సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా ముంతాజ్‌హోట‌ల్ యాజ‌మాన్యంతో చ‌ర్చించి.. వేరే చోట 25 ఎక‌రాల‌ను ఇచ్చేందుకు ఒప్పించార‌ని నాయుడు చెప్పారు. వైసీపీ హ‌యాంలో ప్ర‌తిదానినీ డ‌బ్బుతోనే కొలిచార‌ని నాయుడు అన్నారు. టీటీడీ భూములను ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నారని వైసీపీ చేస్తున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌న్నారు. అవ‌స‌ర‌మైతే.. ఈ వ్య‌వ‌హారంలో సీబీఐ విచారణ కోరుతూ వైసీపీ నాయ‌కులు కేంద్రానికి లేఖ రాయాల‌ని స‌వాల్‌రువ్వారు. డబ్బు వెదజల్లి అందరినీ కొనాల‌నే ప్ర‌య‌త్నంలో వైసీపీ నాయ‌కులు ఉన్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. నాయుడు వ్యాఖ్య‌ల‌పై జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.