మంత్రుల వెనుకబాటు.. రీజన్లు ఇవేనా..!

చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న టిడిపి నాయకులకు ఇటీవల ర్యాంకులు కేటాయించారు. వీటిలో పాలకొల్లు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మల రామానాయుడు మొదటి స్థానంలో ఉండగా, కృష్ణా జిల్లాకు చెందిన కొల్లు రవీంద్ర, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చం నాయుడు, అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్ వంటి వారు చివరి స్థానాల్లో నిలబడ్డారు.

దీంతో అసలు మంత్రులు ఎందుకు వెనుకపడుతున్నారు, దీనికి కారణాలు ఏంటి అన్న విషయంపై పార్టీలోనూ, మంత్రివర్గంలోనూ చర్చగా మారింది.

వాస్తవానికి గతంలో కూడా మంత్రివర్గానికి సంబంధించి చంద్రబాబు ర్యాంకులు కేటాయించారు. అప్పట్లో బాగానే ఉన్న గ్రాఫ్, కొంతమంది మంత్రుల విషయంలో తాజా రిపోర్టులో తగ్గిపోయింది. దీనిపై ఆయా మంత్రులు సహా చంద్రబాబు కూడా ఆలోచన చేస్తున్నారు.

ముఖ్యంగా మంత్రుల వైపు నుంచి వస్తున్న వాదన ఏమిటంటే తమ శాఖలకు సంబంధించిన పనులు చేసుకునేందుకు సమయం ఇవ్వడం లేదని. కనీసం కార్యాలయాలకు వెళ్లే సమయం కూడా తమకు దక్కడం లేదనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట.

ఒకవైపు నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవడం, మరోవైపు ప్రభుత్వం నుంచి వస్తున్న కార్యక్రమాలను నిర్వహించడం, అదే సమయంలో పార్టీ పరంగా ఎదురవుతున్న సమస్యలు, ప్రతిపక్ష వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పడం వంటి వాటితోనే సమయం గడిచిపోతుందని చాలామంది మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉదాహరణకు సుపరిపాలనలో తొలి అడుగు, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి కీలక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత మంత్రులపైనే పడింది. దీంతో వారు తమ తమ నియోజకవర్గాలను వదిలేసి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు.

తమ కార్యాలయాలకు కూడా వెళ్లకుండా ప్రజల మధ్య ఉన్నారు. దీంతో ఫైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇదే విషయాన్ని మంత్రులు చెబుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు, మరోవైపు పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉంటే తమకు సమయం ఎక్కడ ఉందని, ఫైళ్లను క్లియర్ చేసే అవకాశం కూడా ఇవ్వడం లేదని, ఆదివారాలు కూడా పనిచేయాల్సి వస్తుందని ఒకరిద్దరు మంత్రులు చెబుతున్నారు.

ఉదాహరణకు మంత్రి నారాయణ ఆదివారం కూడా పనిచేస్తున్నారు. మరో మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఆదివారం పూట తన శాఖలో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. మిగిలిన రోజుల్లో అటు నియోజకవర్గంలో లేకపోతే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నానని, రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో తలమునకులై ఉన్నానని ఆయన చెబుతున్నారు.

అలాగే అమరావతి విషయంలో నిర్మాణాలను పరిశీలించడం, వైసీపీ నుంచి వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేందుకే తనకు సమయం సరిపోవడం లేదని నారాయణ అంటున్నారు. దీంతో పొరపాలక శాఖకు సంబంధించిన ఫైళ్లు క్లియర్ కావడం లేదనేది ఆయన చెప్పిన మాట.

మంత్రి అచ్చం నాయుడు కూడా రైతులకు సంబంధించిన అంశాలపై జిల్లాల్లో పర్యటించాల్సి వస్తోందని, మరోవైపు సుపరిపాలనలో తొలి అడుగు, అదేవిధంగా జిల్లాలో పర్యటనలతో బిజీగా గడపాల్సి వస్తోందని అంటున్నారు. దీంతో ఫైళ్లు క్లియర్ కావడం లేదని ఆయన చెబుతున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఇదే సమస్యను ప్రస్తావించారు.

మొత్తంగా చూస్తే మంత్రులకు సమయం దొరకడం లేదనేది వారి వాదన. ఈ విషయం తాజాగా చంద్రబాబు వరకు వెళ్లింది. దీంతో ఆయన వారంలో రెండు రోజులు మంత్రులను ఫ్రీగా వదిలేయాలని ఆలోచన చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

మరి దీన్ని ఎప్పటి నుంచి అమల్లో పెడతారు, ఏ విధంగా అమలు చేస్తారు అనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం మంత్రులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది.