బుజ్జగింపు రాజకీయాలు టిడిపికి సరిపోతాయా? నాయకులు, ఎమ్మెల్యేలు చేస్తున్న పొరపాట్లు కావచ్చు, తప్పులు కావచ్చు, వాటిపై పార్టీ అధినేత వ్యవహరిస్తున్న తీరు బుజ్జగింపు రాజకీయాలని తలపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.
గత ఏడాది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు చాలామంది లక్ష్మణ రేఖలను దాటేశారన్నది అందరికీ తెలిసిందే. కొందరు కోవర్టులుగా మారి ప్రతిపక్షానికి సమాచారం చేరవేశారనేది కూడా కొన్నాళ్ల కిందట చర్చకు వచ్చింది. ఇక వ్యక్తిగతంగా వారు వివాదాస్పదమయ్యారు.
కొందరు ప్రభుత్వ కార్యక్రమాల కంటే వ్యక్తిగత కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం, వివాదాస్పద అంశాల జోలికి వెళ్లడం చేశారు. సహజంగా ఐదు సంవత్సరాల పాటు తాము పడ్డ ఇబ్బందులు, తమపై నమోదైన కేసుల నేపథ్యంలో కొంత సంయమనం కోల్పోవడం లేదా తాము అనుకున్నది జరిగి తీరాలన్న పట్టుదలతో నాయకులు వ్యవహరించారన్నది వాస్తవం.
ఈ క్రమంలో చాలామంది ఇచ్చిన సమాచారం, ఆధారాల మేరకు చంద్రబాబు కూడా వాళ్లకి స్వేచ్ఛనిచ్చారు. అదేవిధంగా కొందరిపై కేసులు పెట్టే అవకాశం కూడా కల్పించారు.
అయినా ఇంకా కొంతమంది నాయకులు తమ పంథాలనే నడుస్తున్నారు. తమ ఇష్టానుసారంగానే వ్యవహరిస్తున్నారు. మరి ఇది రోజు రోజుకు పెరుగుతుండడం ఒక సమస్యగా మారింది. ఒక సమస్య పరిష్కారం అయిందిలే అనుకునే సమయానికి మరో వివాదం చోటు చేసుకోవడం కామన్ అయింది.
ఈ పరిణామాలు గమనిస్తే తప్పు చేస్తున్న వారి పట్ల చంద్రబాబు అనుసరిస్తున్న బుజ్జగింపు రాజకీయాల వైఖరి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా ఒకరి విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంటే ఇన్ని తప్పులు, ఇంతమంది రోడ్డున పడే వ్యవహారాలు ఉండేవి కాదన్నది వారు చెబుతున్న మాట.
ఆధిపత్య ధోరణి, ఆదాయం పెంచుకునే విషయంలో అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం ప్రధాన ఉదాహరణగా నిలిస్తే, వ్యక్తిగత అంశాలకు వ్యక్తిగత అధిపత్యానికి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉదాహరణగా నిలిచింది.
ఇక పార్టీ కన్నా నేనే సుప్రీం అన్న ధోరణిని ప్రదర్శించిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే హైలెట్ అయ్యారు. ఇతర నియోజకవర్గాల్లోనూ చాలామంది ఎమ్మెల్యేలు దారి తప్పారు. వీరందరిలో కనీసం ఒకరిపై అయినా చంద్రబాబు కఠినంగా వ్యవహరించి ఉంటే, కఠిన నిర్ణయం తీసుకుని ఉంటే కచ్చితంగా మార్పు కనిపించేది.
ఇంతమంది నాయకులు దారి తప్పకుండా ఉండేవారన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఆది నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి బుజ్జగింపు రాజకీయాలు అలవాటు కాలేదు. అన్నగారి ఎన్టీఆర్ హయంలో తనను ధిక్కరించిన వారిని పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి అందరికీ తెలిసిందే. కనీసం వారి మొహం కూడా చూడ్డానికి అన్నగారు ఇష్టపడేవారు కాదు. వాళ్లు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా పార్టీ విధానాలు, పార్టీ లైన్ ప్రకారం నడుచుకోవాలని స్పష్టంగా చెప్పేవారు.
కానీ, అదేంటో చంద్రబాబు వచ్చిన తర్వాత అధికారంలో ఉంటే బ్రతిమాలుకోవడం, అధికారంలో లేకపోయినా బ్రతిమాలుకోవడం అనే సంస్కృతి కొనసాగుతోంది. దీని నుంచి పార్టీని బయటకు తీసుకురావాల్సిన అవసరం, నిబద్ధతతో పనిచేసే వారికి అవకాశాలు కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అలా చేయనంతవరకు నాయకుల దూకుడు, హద్దులు దాటడం అనే పరిస్థితులు కొనసాగుతూనే ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates