జ‌గ‌న్ కోసం 300 కోట్లు క‌డుతున్న ప్ర‌భుత్వం!?

అదేంటి అనుకుంటున్నారా? నిజ‌మే. వైసీపీ అధినేత జ‌గ‌న్ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం 312 కోట్ల రూపాయలను నెల నెలా చెల్లిస్తోంద‌ని ఆర్థిక శాఖ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆయ‌న‌ హ‌యాంలో చేసిన అప్పుల‌కు సంబంధించిన వ‌డ్డీల‌ను ఈ నెల నుంచి నెల‌కు 312 కోట్ల రూపాయ‌ల చొప్పున చెల్లించాల్సి వచ్చింద‌ని ఆర్థిక శాఖ వెల్ల‌డించింది. మొత్తం అప్పులు 4.23 ల‌క్ష‌ల కోట్లు ఉన్నాయని.. దీనిలో 2.86 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను అచ్చంగా జ‌గ‌న్ హ‌యాంలోనే చేసిన అప్పుగా పేర్కొన్నారు.

ఈ మొత్తాన్ని ప్ర‌భుత్వ గ్యారెంటీ చూపించి తీసుకువ‌చ్చార‌ని అధికారులు తెలిపారు. ఇవి కాకుండా.. మ‌రో మూడు ల‌క్ష‌ల కోట్ల‌ను కార్పొరేష‌న్లు, మ‌ద్యం అమ్మ‌కాల‌ను వినియోగించి.. వాటి ల‌క్ష్యాల‌ను చూపించి అప్పులు తెచ్చార‌ని చెబుతున్నారు. ఈ మొత్తాల‌పై వ‌డ్డీల‌ను కార్పొరేష‌న్లు చెల్లించాల్సి ఉంటుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం నెల‌కు 312 కోట్ల రూపాయ‌లను వ‌డ్డీ రూపంలో చెల్లించాల‌ని అధికారులు నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. ఇప్ప‌టికే చాలా మేర‌కు వ‌డ్డీలు కూడా పేరుకుపోయాయ‌ని అంటున్నారు.

ఇదిలావుంటే.. మొత్తంగా అప్పుల సంగ‌తి ఎలా ఉన్నా.. ఏటా 3600 కోట్ల రూపాయ‌ల‌ను వ‌డ్డీగానే చెల్లించా ల్సి రావ‌డంతో ఆ మొత్తాన్ని ఎలా స‌మీక‌రించాల‌న్న విష‌యంపై ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ త‌ర్జ న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ప్ర‌స్తుత బ‌డ్జెట్‌లో వ‌డ్డీల‌కు కేటాయించిన సొమ్ము కేవ‌లం 1200 కోట్లుగా ఉంది. ఈ మొత్తం ఇప్పుడు ఎటూ సరిపోని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో నెల‌కు 312 కోట్ల రూపాయ‌ల చొప్పున చెల్లించే విష‌యంపై సీఎం చంద్ర‌బాబుతో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని భావిస్తున్నారు.

ఎందుకైంది?

వైసీపీ హ‌యాంలో అప్పుల‌పై అప్పులు తీసుకువ‌చ్చారు. అయితే.. ఆయా సొమ్ముల‌తో అభివృద్ధి కార్య‌క్ర మాల‌కు బ‌దులుగా.. సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు నిధులు వెచ్చింది. దీంతో రాబ‌డి త‌గ్గిపోయింది.. అప్పులు పెరిగిపోయాయి. ఎన్నిక‌ల‌కు రెండు మాసాల ముందు ఫిబ్ర‌వ‌రిలోనూ ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు కోసం అప్పులు చేశారు. దీంతో ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వంపై నాటి జ‌గ‌న్ అప్పుల భారం భారీగా ప‌డింది. అప్పుల అస‌లు తీరే మాట ఎలా ఉన్నా.. ఇప్పుడు వ‌డ్డీలు చెల్లించ‌లేక ఇబ్బందులు ప‌డుతున్నారు.