కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) అగ్రనేత, ప్రజా ఉద్యమాలకు అలుపెరుగని గళం వినిపించిన నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి ఇక లేరు. 83 ఏళ్ల సురవరం గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 11.40 నిమిషాల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1942, మార్చి 25వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో ఆయన జన్మించారు.
విద్యార్థిగా ఆయన ఆలోచనలు ఒకవైపు చదువు, మరోవైపు హక్కుల కోసం అన్నట్టుగా సాగాయి. ఈ పరంపరలోనే ఆయన.. విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేసుకుని.. హక్కుల కోసం పోరాడారు. ఇది.. ఆయనను తర్వాత కాలంలో నాయకుడిగా నిలిచే లా చేసింది. తొలితరం కమ్యూనిస్టులను ఆకర్షించేలా చేసింది. తండ్రి వెంకట్రామిరెడ్డి.. స్వాతంత్ర సంగ్రామంలో చూపిన చొరవ.. చాకలి ఐలమ్మ వంటి స్ఫూర్తిదాయక వక్తుల జీవిత విశేషాలను చదువుకున్న స్ఫూర్తి వంటివి సురవారాన్ని అనతి కాలంలోనే ఉద్యమాల బాట పట్టేలా చేశాయి. “ప్రశ్నిస్తే.. పోయేదేమీ లేదు“ అని పదే పదే చెప్పే సురవరం.. తన గళాన్ని ప్రజల కోసం ప్రశ్నించే గొంతుగా మార్చుకున్నారు.
కర్నూలు నుంచే ప్రస్థానం
సురవరం సుధాకర్ రెడ్డి ఉద్యమ ప్రస్థానం కర్నూలు నుంచే ప్రారంభమైంది. 1960లో ఏఐఎస్‌ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా ఎన్నికైన ఆయన తర్వాత రెండేళ్లకే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం(ఎస్‌వీ) స్థాపన కోసం అలుపెరుగని పోరాటాలు చేశారు. ఫలితంగా అప్పటి ప్రభుత్వం ఎస్వీ ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా.. ప్రారంభమైన ఉద్యమాలు.. తర్వాత కాలంలో సురవరానికి ఎనలేని గుర్తింపు తెచ్చాయి. సీపీఐ ప్రధాన విద్యార్థి విభాగం ఏఐఎస్ ఎఫ్‌లో విద్యార్థి నాయకుడిగా ఆయన దూకుడుగా వ్యవహరించారు. తర్వాత.. అదే విభాగానికి జాతీయ ప్రధానకార్యదర్శి అయ్యారు. 1970లో ఏఐఎస్‌ఎఫ్, 1972లో ఏఐవైఎఫ్‌నకు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
ఇక, సీఐపీలో ప్రస్థానం మరో రూపంలో సాగింది. 1971లో కేరళలోని కొచ్చిన్‌లో జరిగిన సీపీఐ 9వ నేషనల్ కౌన్సిల్ సమావేశాల్లో సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడిగా తొలిసారి పదవి పొందారు. 1974లో ఉమ్మడి ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. అనంతరం.. ఆయన రెండు సార్లు నల్గొండ నుంచి ఎంపీగా విజయం దక్కించుకున్నారు. 2012 నుంచి 2019వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ సమయంలోనే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూపకల్పన చేసే బాధ్యతల కోసం నియమించిన కమిటీలో సురవరం కీలక సభ్యుడిగా వ్యవహరించారు.
రేపు దానం..
సురవరం సుధాకర్‌రెడ్డి భౌతిక దేహాన్ని ప్రజలు, పార్టీ అభిమానుల సందర్శన కోసం.. ఆదివారం మధ్యాహ్నం వరకు పార్టీ ఆఫీసులో ఉంచుతారు.అనంతరం.. గాంధీ ఆసుపత్రికి దానం చేయనున్నారు. ఆయన కుమారుడు ఒకరు అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఆదివారం ఉదయం వరకు.. భౌతిక దేహాన్ని ఆసుపత్రిలోని మార్చురీలోనే ఉంచనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates