కుక్క‌ల‌పై తీర్పు రివైజ్.. సుప్రీంకోర్టు ఏమందంటే!

దేశ రాజ‌ధాని ఢిల్లీలో వీధి కుక్క‌లు పెరిగిపోయాయ‌ని.. వీటిని 8 వారాల్లో ఖాళీ చేయించి.. న‌గ‌రానికి దూరంగా ఎక్క‌డైనా వ‌దిలేయాల‌ని పేర్కొంటూ.. ఈ నెల 11న ఇచ్చిన సుప్రీంకోర్టు సంచ‌ల‌నం రేపింది. అంతే కాదు.. ఒక్క కుక్క క‌నిపించినా.. అధికారుల‌పై భారీ జ‌రిమానాలు విధిస్తామ‌ని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక అక్క‌డితోనూ అప్ప‌ట్లో శాంతించ‌లేదు. తాము ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేయ‌డానికి వీల్లేద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. అలా ఎవ‌రైనా స‌వాల్ చేస్తే.. భారీ జ‌రిమానాల‌కు సిద్ధ‌మై కోర్టుకు రావాల‌ని తేల్చి చెప్పింది.

అయితే.. సుప్రీంకోర్టు ఎన్ని చెప్పినా.. బాలీవుడ్ నుంచి దేశ‌వ్యాప్తంగా.. అన్ని రాష్ట్రాల్లోనూ జంతు ప్రేమికులు క‌దం తొక్కారు. కుక్క‌లకు ర‌క్ష‌ణ‌గా నిలిచారు. సుప్రీంకోర్టు తీర్పును రివైజ్ చేయాల‌ని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కూడా అనేక మంది లేఖ‌లు రాశారు. వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న సుప్రీంకోర్టు తాజాగా గ‌త 11వ తేదీన ఇచ్చిన తీర్పును రివైజ్ చేస్తూ మరో ఉత్త‌ర్వు జారీ చేసింది. దీని ప్ర‌కారం ఢిల్లీలో కుక్క‌లు ఉండేందుకు అనుమ‌తి ఇచ్చింది.

అయితే.. కేవ‌లం రెబీస్ వ్యాధి సోకిన కుక్క‌ల‌ను మాత్రం న‌గ‌రానికి కడుదూరంగా పంపించేయాల‌ని ఆదేశించింది. అదేస‌మ‌యంలో న‌గ‌రంలో ఉండే కుక్క‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రీక్ష‌లు చేయాల‌ని, వ్యాక్సిన్ ఇవ్వాల‌ని, పిల్ల‌లు పుట్ట‌కుండా ఆప‌రేష‌న్ చేయాల‌ని కూడా ఆదేశించింది. వీధుల్లో తిరిగే కుక్క‌ల‌కు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఎవ‌రూ ఆహారం పెట్ట‌డానికి వీల్లేద‌ని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆహారం పెట్టేందుకు స్థానిక కార్పొరేష‌న్ అధికారులు వేరే షెల్ట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని సూచించింది.

ఇవీ ముఖ్యాంశాలు

  • వీధి కుక్క‌ల విష‌యంలో ఢిల్లీకే కాకుండా దేశ‌వ్యాప్తంగా అమ‌లయ్యేలా ఉత్త‌ర్వుల స‌వ‌ర‌ణ‌. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ సీఎస్‌లకు నోటీసు.
  • కుక్కలకు స్టెరిలైజ్‌ చేసి వదిలేయాలని ఆదేశం.
  • మనుషులపై దాడిచేసే, రేబిస్‌ ఉన్న కుక్కలను షెల్టర్‌లలో ఉంచాలని తీర్పు.
  • బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్ద‌ని ఆదేశం.
  • వీధి కుక్క‌ల‌ను ద‌త్త‌త తీసుకునే వారిని ప్రోత్స‌హించాల‌న్న కోర్టు.