వైసీపీ ఏర్పాటు చేసినా.. కొన‌సాగిద్దాం: బాబు

సాధార‌ణంగా రాష్ట్ర రాజ‌కీయాలు విభిన్నంగా ఉంటాయి. గ‌త ప్ర‌భుత్వాలు అనుస‌రించిన విధానాల‌ను, తీసుకున్న నిర్ణ‌యాలను త‌ర్వాత వ‌చ్చే ప్ర‌భుత్వాలు కొన‌సాగించాల‌ని ఏమీ లేదు. పైగా వాటిని ప‌క్క‌న పెడుతూ ఉంటాయి. తెలంగాణలో అయినా, ఏపీలో అయినా ప్ర‌భుత్వాలు మార‌గానే అనేక నిర్ణ‌యాలు బుట్ట‌దాఖ‌ల‌య్యాయి.

ఏపీలో అయితే పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నాన్ని రూ.5కే పెట్టే అన్నాక్యాంటీన్ల‌ను జ‌గ‌న్ స‌ర్కారు రాజ‌కీయ దురుద్దేశంతో రాత్రికి రాత్రి ప‌క్క‌న పెట్టింది. ప్ర‌జ‌ల నుంచి ఎన్ని డిమాండ్లు వ‌చ్చినా ప‌ట్టించుకోలేదు.

రాష్ట్ర భ‌విత‌ను మార్చే రాజ‌ధాని అమ‌రావతిని కూడా జ‌గ‌న్ తోసిపుచ్చారు. ఇక 10 కోట్ల రూపాయ‌ల ప్ర‌జా ధ‌నంతో నిర్మించిన ప్ర‌జా వేదిక‌ను నేల‌మ‌ట్టం చేశారు. అయితే ఇప్పుడు వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం వైసీపీ హ‌యాంలో ప్ర‌జాకంట‌కంగా ఉన్న నిర్ణ‌యాలు త‌ప్ప సానుకూలంగా ఉన్నవాటిని, ప్ర‌జ‌ల‌కు చేరువగా ఉన్న వాటిని కూడా య‌థాత‌థంగా కొన‌సాగిస్తోంది.

ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ హ‌యాంలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు స‌చివాల‌యాల‌ను య‌థాత‌థంగా కొన‌సాగించాల‌ని తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు స‌హా మంత్రులు నిర్ణ‌యించారు.

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌, వార్డుల్లో స‌చివాల‌యాలు ఉన్నాయి. ప్ర‌తి 2 వేల కుటుంబాల‌కు ఒక‌టి చొప్పున ఈ స‌చివాల‌యాల‌ను అప్ప‌ట్లో వైసీపీ నిర్మాణం చేసింది. దీనిలో సెక్ర‌ట‌రీ స్థాయి నుంచి పై స్థాయి వ‌ర‌కు 2 ల‌క్ష‌ల మంది ప‌ర్మినెంటు ఉద్యోగుల‌ను కూడా నియ‌మించింది. కానీ కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత వీటిని తీసేయాల‌ని టీడీపీ నాయ‌కుల నుంచి డిమాండ్లు వ‌చ్చినా చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదు. వ‌లంటీర్ల‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో వారిని మాత్రమే ప‌క్క‌న పెట్టారు.

స‌చివాల‌యాల‌ను కొన‌సాగిస్తున్నారు. తాజాగా వీటిని కొన‌సాగించ‌డంతోపాటు మ‌రింత బ‌లోపేతం చేసేలా కూడా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిప్యూటేషన్‌, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 2,778 పోస్టులను సృష్టించి ప్ర‌జ‌ల‌కు వీటిని మ‌రింత చేరువ చేయాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించింది. దీనికి మంత్రి మండ‌లి ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది.

అయితే ఒక‌రిద్ద‌రు మంత్రులు అవి వైసీపీ హ‌యాంలో ఏర్పాటు చేశార‌ని చెప్ప‌గా, త‌న‌కు తెలుసున‌ని, ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని భావిస్తే కొన‌సాగించ‌డం త‌ప్పుకాద‌ని, అన్నింటినీ రాజ‌కీయ కోణంలో చూడొద్ద‌ని కూడా చంద్ర‌బాబు చుర‌క‌లు అంటించారు.